- ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే కుదరదు
- హైడ్రా కమిషనర్ తీరుపై హైకోర్టు అసంతృప్తి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ భూముల రక్షణ పేరుతో హైడ్రా ఇష్టానుసారం వ్యవహరించడానికి వీల్లేదని, చట్ట ప్రకారమే వ్యవహరించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. పరిధి దాటుతున్న హైడ్రా తీరుపై హైకోర్టు సోమవారం అసహనం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ చట్ట పరిధిలోనే విధులు నిర్వహించాలని, చట్టానికి అతీతులు కాదని వ్యాఖ్యానించింది.
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ కలాన్ సర్వే నం.132, 133లోని 650 చదరపు గజాల ప్లాట్‌పై వివరణ ఇవ్వాలని చెప్పింది. సాహెబ్‌నగర్ కలాన్‌లోని ప్లాట్‌ను హైడ్రా స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ మూసారాంబాగ్‌కు చెందిన పూర్ణిమ అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ సోమవారం విచారణ చేపట్టారు. హైడ్రాకు వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలవుతూనే ఉన్నాయని, వాటిలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడం లేదన్నారు.
రాజ్యాంగ కోర్టులు చెబుతున్నా తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి మార్గదర్శకాల మేరకు పనిచేయాల్సి ఉందని, దానికి విరుద్ధంగా సొంత నిర్ణయాలతో పనిచేయడం చెల్లదన్నారు. ప్రభుత్వ భూముల రక్షణ పేరుతో కోర్టుల్లో పెండింగ్ ఉన్న భూముల్లోనూ జోక్యం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తూ.. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని హైడ్రా న్యాయవాదిని ఆదేశిస్తూ.. విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
