మున్సిపల్ చైర్మెన్ ఎన్నికల వేళ తొర్రూరులో హైటెన్షన్ నెలకొంది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు పార్టీల శ్రేణుల వ్యతిరేక నినాదాలతో మున్సిపల్ ఆఫీసు ప్రాంగణం హోరెత్తుతోంది.తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 16, ఇద్దరు ఎక్స్ అఫిషీయో సభ్యులతో కలిసి 18 ఓట్లు ఉండగా.. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 07 స్థానాలు సొంతం చేసుకున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషీయో ఓట్లతో కలిపి కాంగ్రెస్ బలం కూడా 9కి చేరుకోవడంతో చైర్మెన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.
బీఆర్ఎస్ నుంచి ఇద్దరు వార్డు కౌన్సిలర్లు పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న క్రమంలో తొర్రూరు మున్సిపల్ ఆఫీసు దగ్గర హైటెన్షన్ నెలకొంది. భారీ జనసమీకరణకు ప్లాన్ చేసింది బీఆర్ఎస్. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీసు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే మున్సిపల్ ఆఫీసు దగ్గరికి చేరుకున్న ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది.
ఇరు వర్గాలు వ్యతిరేక నినాదాలు చేస్తూ పోలీసులను సైతం తోసుకుంటూ మున్సిపల్ ఆఫీసు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి అదుపు తప్పనట్లు తెలుస్తోంది.
