కార్తి హీరోగా వచ్చిన ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ వస్తోంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించగా ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. సుబ్రహ్మణ్య స్వామికి పరమ భక్తుడైన చంద్రబోస్ అలియాస్ సర్దార్ జాతర పనుల్లో ఉండగా, జపాన్‌లో జరిగే ఒక సీక్రెట్ బ్లాక్-ఆప్స్ మిషన్ కోసం పిలుస్తారు. 30 కోట్ల మంది ప్రాణాలను కాపాడే ఆ మిషన్‌ను అతను సక్సెస్ చేస్తాడు. కానీ అక్కడ జరిగిన పరిణామాలు అతన్ని జీవితాంతం వెంటాడుతుంటాయి. ఇదంతా సర్దార్ గతం.
ఇక ప్రస్తుత కాలంలో దేశానికి ఎదురయ్యే తీవ్రమైన ముప్పు సర్దార్, అతని కొడుకు విజయ్ ప్రకాష్‌ను మరో ప్రమాదకరమైన మిషన్‌లోకి తీసుకెళ్తుంది. మిస్టీరియస్ విలన్‌ను వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు అన్నది మిగతా కథ. తండ్రి, కొడుకుగా కార్తి బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్‌లో డిఫరెన్స్ చూపించాడు. విలన్‌గా ఎస్‌జే సూర్య కనిపించాడు. హై వోల్టేజ్ స్పై యాక్షన్ సీన్స్‌తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్, రజిషా విజయన్, అచ్యుత్ కుమార్, యోగిబాబు ఇతర పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 10న సినిమా విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులో విడుదల చేస్తోంది.
