కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని 1003 నుంచి 1006 సర్వే నంబర్లల్లోని 13.17 ఎకరాల స్థలంలో కూల్చేసిన కాంపౌండ్, ఫెన్సింగ్, సెక్యూరిటీ గదులు, ప్రవేశ ద్వారాలను 24 గంటల్లో పునరుద్ధరించాలని ఆదేశించింది. అక్కడ ఏర్పాటు చేసిన హైడ్రా, రెవెన్యూ శాఖ బోర్డులు తొలగించాలంది.
హైదరాబాద్, వెలుగు: వేర్వేరు కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా కూల్చివేతలు చేపడుతుండటంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. స్వయంగా ఇచ్చిన హామీకి విరుద్ధంగా రాత్రికి రాత్రి కూల్చివేతలు చేపట్టడాన్ని తప్పుబట్టింది. వెంటనే పిటిషనర్ ఆస్తిలో చేసిన కూల్చివేతలను 24 గంటల్లోగా పునరుద్ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలోని 1003 నుంచి 1006 సర్వే నెంబర్లల్లోని 13.17 ఎకరాల స్థలంలో ఈనెల 25కు ముందున్నట్లుగా నిర్మాణాలను పునరుద్ధరించాలని హైడ్రాతో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, తహసీల్దార్లను ఆదేశించింది. ఈనెల 26న తెల్లవారుజామున 3.30 గంలకు నోటీసులు ఇవ్వకుండా కాంపౌండ్, ఫెన్సింగ్, సెక్యూరిటీ గదులు, ప్రవేశ ద్వారాలను హైడ్రా కూల్చివేయడమే కాకుండా అక్కడున్న మిషన్లు, ఇతర పరికరాలను ధ్వంసం చేసిందని, విద్యుత్తు సరఫరాను నిలిపివేసిందని.. ఈ చర్యలు కోర్టు ఉత్తర్వులకు విరుద్ధమంటూ ఎన్.వి.ఎన్. కన్ స్ట్రక్షన్స్ మూడు వేర్వేరు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసింది. వీటిని హైకోర్టు విచారించింది.
ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ..‘‘కోర్టులో కేసులు ఉన్న వ్యవహారాల్లోనూ, కోర్టుకు హామీ ఇచ్చిన కేసుల్లోనూ హైడ్రా తనకు తోచినట్లు చేస్తున్నది. ఇది హైడ్రాకు కొత్తకాదు. మొదట కూల్చేయడం.. ఆ తర్వాత తన చర్యలను సమర్ధించుకోవడం.. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేయడం హైడ్రాకు పరిపాటి అయ్యింది. తమ ముందున్న కేసులో ఆధారాలను పరిశీలిస్తే.. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరించినట్లు స్పష్టం అవుతోంది.
అందుకే పిటిషనర్ స్థలంలో ఈనెల 25కు ముందు ఏవి ధమైన పరిస్థితులు ఉన్నాయో అదే విధంగా 24 గంటల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. ఆ స్థలం వద్ద హైడ్రా, రెవెన్యూ శాఖలు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్, బోర్డు తీసేయాలి’’ అని ఉత్తర్వులిచ్చింది.
