హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఈసీ మీటింగ్ ఎప్పుడు..14 నెలలుగా ఎడ్యుకేషన్ నిర్ణయాలన్నీ పెండింగ్

హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్  ఈసీ మీటింగ్ ఎప్పుడు..14 నెలలుగా ఎడ్యుకేషన్ నిర్ణయాలన్నీ పెండింగ్
  • పలు కోర్సుల సిలబస్ మార్పులు, క్రెడిట్ విధానాలు రాటిఫై కాలే 
  • కొత్త చైర్మన్ వచ్చి ఏడాది దాటినా సమావేశం ఊసే లేదు
  • మీటింగ్ నిర్వహణపై దృష్టి పెట్టాలని వర్సిటీల విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు:
తెలంగాణ హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్ (టీజీ సీసీహెచ్ఈ) కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్  కమిటీ (ఈసీ) మీటింగ్ 14 నెలలుగా జరగడం లేదు. ప్రతి మూడు నెలలకోసారి జరగాల్సిన సమావేశం.. కొత్త చైర్మన్  నియామకం జరిగి ఏడాది దాటినా నిర్వహించడం లేదు. 

దీంతో పలు కీలక నిర్ణయాలపై జాప్యం జరుగుతున్నదనే చర్చ మొదలైంది. ప్రధానంగా డిగ్రీ, పీజీ, ఇతర ప్రొఫెషనల్  కోర్సుల సిలబస్  మార్పులు, యూజీసీ/ఏఐసీటీఈ క్రెడిట్  విధానాలు, టీజీ ఎప్​సెట్ మాక్  కౌన్సెలింగ్  వంటి మార్పులు ఈసీలో రాటిఫై (అధికారికంగా ఆమోదం తెలపడం) కాలేదు. 

దీంతో ఇప్పటికే అమలవుతున్న నిర్ణయాలు రాటిఫై కాకపోతే పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  స్వతంత్ర సంస్థ అయినా.. ప్రతి నిర్ణయానికీ ఈసీ ఆమోదం తప్పనిసరి. 

ఈసీలో చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు ఎడ్యుకేషన్, ఫైనాన్స్, లేబర్  సెక్రటరీలు, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, ప్రభుత్వ నామినేటెడ్ విద్యావేత్తలు, పారిశ్రామిక నిపుణులు సభ్యులుగా ఉంటారు. టెక్నికల్  ఎడ్యుకేషన్  కమిషనర్, కౌన్సిల్  సెక్రటరీ ఇన్వైటీలుగా పాల్గొంటారు. ఇలా ఈసీలో అన్ని రంగాలకు చెందిన వారు ఉండడంతో ప్రతి అంశంపై క్షుణ్నంగా చర్చ జరుపుతారు. 

చివరి మీటింగ్ గతేడాది సెప్టెంబర్ 6న

నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈసీల సమావేశం జరగాలి. చివరి సమావేశం 2024 సెప్టెంబర్ 6న జరగ్గా.. తర్వాత అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త చైర్మన్ గా బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ గా ఇటిక్యాల పురుషోత్తం నియమితులయ్యారు. 

అప్పటి నుంచి మీటింగ్  జరగకపోవడంతో సెప్టెంబర్  తర్వాత తీసుకున్న నిర్ణయాలు రాటిఫికేషన్  కోసం పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. ఈ ఏడాది జూన్, -జులైలో మీటింగ్  నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగినా, కౌన్సిల్  అధికారులు ఎందుకో వెనక్కి తగ్గారు.

విద్యారంగ పనులు ఆలస్యం..

ఇటీవల డిగ్రీ కోర్సుల సిలబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్పులు, యూజీసీ/ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగా క్రెడిట్  విధానాలు, టీజీ  ఎప్ సెట్  మాక్  కౌన్సెలింగ్ ప్రక్రియలు జరిగాయి. వీటిన్నింటికీ ఈసీ ఆమోదం తప్పనిసరి. ఈసీ ఆమోదం తెలిపితే సర్కారు ఆమోదం తెలిపినట్లే. 

ఈ క్రమంలో కౌన్సిల్  నిర్ణయాలను అమలు చేయడంపై ఒకటి, రెండు వర్సిటీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. మరోపక్క, సీఎం రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్వాలిటీ పెంపు, డొనేషన్ల కట్టడికి చర్యలు తీసుకోవడంపై  ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై ముందుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. 

అందువల్ల ఇప్పటికైనా కౌన్సిల్, విద్యా శాఖ ఉన్నతాధికారులు మీటింగ్  నిర్వహణపై దృష్టి పెట్టాలని వివిధ యూనివర్సిటీ అధికారులు కోరుతున్నారు. ఈ ఆలస్యం విద్యార్థులు, కాలేజీల సమన్వయానికి అడ్డంకిగా మారుతోందని వారు పేర్కొంటున్నారు.