మాదాపూర్, వెలుగు: హైటెక్ సిటీలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ యువకుడిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద 15 గ్రాముల ఎండీఎంఏ, 382 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన తరుణ్ తేజ(22) బీఎస్సీ వరకు చదివి మాదాపూర్ చంద్రనాయక్ తండాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటూ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు.
ఈ క్రమంలో గంజాయికి అలవాటు పడ్డ అతడు విజయవాడకు చెందిన కార్తీక్, పృథ్వి నుంచి ఎండీఎంఏ, ఓజీ కుష్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చి తన ఫ్లాట్‌లో విక్రయిస్తున్నాడు.
డ్రగ్స్ అమ్మకంపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు, కూకట్‌పల్లి ఎస్‌వోటీ పోలీసులు కలిసి తరుణ్ ఫ్లాట్‌పై దాడి చేశారు. గదిలో 15 గ్రాముల ఎండీఎంఏ, 382 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 8 మంది యువకులు తరుణ్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు రాగా, వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని నోటీసులు ఇచ్చి పంపించారు. నిందితుడు తరుణ్‌ను అరెస్ట్ చేశారు.
