
హైదరాబాద్ హైదర్ గూడలోని అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఎంఏ గార్డెన్ ఫంక్షన్ హాల్ సీజ్ చేశారు అధికారులు. ఈ ఫంక్షన్ హాల్ నడుపుతున్న స్థలం ప్రభుత్వానిది అని సుప్రీంకోర్టులో తేలడంతో.. గురువారం ( సెప్టెంబర్ 11 ) అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో ఫంక్షన్ హాల్ నడుపుతున్నారంటూ నిర్వాహకులపై గతంలోనే కేసు నమోదయ్యింది. ఇందుకు సంబంధించిన కేసు గత కొంతకాలంగా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది.
గత కొంతకాలంగా ఈ కేసుపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్న స్థలం ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఫంక్షన్ హాల్ ను సీజ్ చేశారు హిమాయత్ నగర్ ఎమ్మార్వో. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసుల సెక్యూరిటీ మధ్య ఫంక్షన్ హల్ ను అధీనంలోకి తీసుకున్నారు రెవెన్యూ అధికారులు.
►ALSO READ | బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్.. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
ఈ క్రమంలో ఫంక్షన్ హాల్ యజమాని అధికారులతో వాగ్వాదానికి దిగటంతో ఘటాస్థలం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులు ఎంత చెప్పినా ఫంక్షన్ హాల్ నిర్వాహకులు వినకపోవడంతో.. గేటు తాళాలు పగలకొట్టి ఫంక్షన్ హాల్ ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఫంక్షన్ హాల్ యజమానికి మద్దతుగా వచ్చిన ఎంఐఎం ఎమ్మెల్సీ మిరాజ్ రెహ్మాత్ బేగ్ కూడా అధికారులతో వాగ్వాదానికి దిగటం గమనార్హం.