కరీంనగర్: హిస్సార్ ఎక్స్ ప్రెస్కు (22737) పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామ శివారులో హిస్సార్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్ వీల్ విరిగిపోయింది. ఈ క్రమంలో.. రాత్రి రెండు గంటల నుంచి ఈ ట్రైన్ నిలిచి పోయింది. మరో ఇంజన్ సహాయంతో ఈ రైలును రైల్వే అధికారులు హనుమకొండ జిల్లా ఉప్పల్కు తీసుకెళ్లారు. మరో రైలు దక్షిణ్ ఎక్స్ప్రెస్ను కమలాపూర్ మండలం ఉప్పల్లో అధికారులు నిలిపివేశారు. రైల్వే సిబ్బంది హిస్సార్ ఎక్స్ప్రెస్కు మరమ్మతు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే గేటు దాటుతుండగా రైలు ఢీకొని బాలమణి (58) అనే మహిళ అక్కడికక్కడికే మృతి. చెందింది. రైలు ఢీకొనడంతో మహిళ ముక్కలు ముక్కలుగా దూరంలో పడిపోయింది.
ఘటనా స్థలం దగ్గర దొరికిన ఆధార్ కార్డు ద్వారా మృతురాలు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపూర్కు చెందిన బాలామణిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టంకోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘట్ కేసర్ దగ్గరలోనే ఈ రైల్వే గేటును సంవత్సరం నుంచి మూసివేశారు.
