తెలంగాణ లో తొలిసారి.. మేయర్ పీఠంపై సీపీఐ జెండా..!

తెలంగాణ లో తొలిసారి.. మేయర్ పీఠంపై సీపీఐ జెండా..!
  •     కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ ​గిరిజనుడే ​
  •     డిప్యూటీ మేయర్ కోసం కాంగ్రెస్ కసరత్తు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తెలంగాణలో తొలిసారిగా మేయర్​ పీఠంపై సీపీఐ జెండా ఎగురనుంది. జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్​ మేయర్​ను సీపీఐ దక్కించుకుంది. కార్పొరేషన్​లో 60 డివిజన్లకు సీపీఐ, కాంగ్రెస్​చెరో 22 స్థానాలను దక్కించుకున్నాయి. బీఆర్ఎస్ 8 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. 

ఈ క్రమంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య శనివారం రాష్ట్ర స్థాయిలో చర్చలు జరిగాయి. రెండున్నరేండ్లు మేయర్, మరో రెండున్నరేండ్లు డిప్యూటీ మేయర్​గా ఇరు పార్టీలు పదవులను పంచుకునేందుకు సీపీఐ, కాంగ్రెస్​మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మేయర్​పదవికి సీపీఐ, డిప్యూటీ మేయర్​పదవిపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. 

తొలిసారిగా మేయర్ పీఠంపై సీపీఐ..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని సీపీఐ దక్కించుకొని తెలంగాణలో చరిత్ర సృష్టించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో విజయవాడలో తప్ప.. తెలంగాణలో సీపీఐ ఏనాడూ కార్పొరేషన్ మేయర్​పీఠం దక్కించుకున్న దాఖలాలు లేవు. సీపీఐ వందేండ్ల ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో మేయర్ పదవి రావడంతో కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. 

తెలంగాణలో సీపీఐకి ఏకైక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నియోజకవర్గం నుంచే ఎంపికయ్యారు. ఇప్పుడు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి కూడా సీపీఐకి దక్కడంతో పార్టీశ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మేయర్ ఎంపికపై ఉత్కంఠ..

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపికపై సీపీఐలో తీవ్ర స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. సీపీఐ పార్టీ నుంచి మూడ్​గణేశ్​తోపాటు కళావతి, సుజాత మేయర్​బరిలో ఉన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా సెక్రటరీ ఎస్​కె.సాబీర్​పాషా ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెంలోని శేషగిరి భవన్​లో సమావేశం నిర్వహించారు. మేయర్ ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. 

డిప్యూటీ మేయర్ ఎంపికపై కసరత్తు..

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్​పదవి కాంగ్రెస్​కు దక్కింది. డిప్యూటీ మేయర్ ఎంపిక విషయంలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. జిల్లాలో ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డితోపాటు పలువురు సీనియర్​ నేతలతో మంత్రి చర్చలు సాగిస్తున్నారు. డిప్యూటీ మేయర్ రేసులో రావి రాంబాబు, దావూద్, నూకల సరిత, కాల్వ భాస్కర్, కొత్వాల విమలాదేవి ఉన్నారు. వీరితో పాటు మరికొందరి పేర్లను మంత్రి పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది.