
హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతం అంటే హాట్ కేక్ లాంటి ఏరియా. అక్కడ గజం భూమి కూడా లక్షల్లో ధర పలుకుతుంటుంది. అలాంటి ప్లేస్ లను ఆక్రమించుకునేందుకు కబ్జాకోరులు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా రైల్వే స్టేషన్ పక్కన ఉన్న చెరువును మాయం చేసి కబ్జా చేయాలని చూసిన నిర్మాణ సంస్థకు హైడ్రా షాకిచ్చింది.
బుధవారం (ఆగస్టు 06) వాసవీ నిర్మాణ సంస్థపై హైడ్రా చర్యలు తీసుకుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని వరద కాలువ ఆక్రమణలపై పోలీసు కేసు నమోదు చేశారు. భరత్ నగర్- ఖైతలాపూర్ మార్గంలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను కలుపుతూ సాగే వరద కాలువను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారణకు వచ్చారు హైడ్రా అధికారులు. 17 మీటర్ల వెడల్పుతో పాటు.. ఇరువైపులా 9 మీటర్ల చొప్పున బఫర్ విడిచి పెట్టకుండా.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు చేశారు.
స్థానికుల ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పర్యటించి వాసవి నిర్మాణ సంస్థ కబ్జాలకు పాల్పడ్డట్లు కమీషనర్ రంగనాథ్ నిర్ధారించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని ముల్లకత్వ చెరువు - కాముని చెరువు - మైసమ్మ చెరువులను కలుపుతూ వెళ్లే వరద కాలువలో మట్టి పోసినట్టు గుర్తించారు. దీంతో వాసవి సంస్థపై కేసు పెట్టాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
కాలువలో పోసిన మట్టిని జేసీబీ, టిప్పర్లతో తొలగించి వాసవీ నిర్మాణ సంస్థకు చెందిన స్థలంలోనే పడేసింది హైడ్రా. వరద కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారంటూ వాసవీ నిర్మాణ సంస్థపై కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ లో ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వాసవీ సరోవర్ పేరిట ఖైతలాపూర్‌లో నిర్మాణాలు చేపడుతున్నప్పుడే వరద కాలువకు సంబంధించిన నిబంధనలను పాటించాలని చెప్పామని హైడ్రా తెలిపింది. అయినా ఎలాంటి నిబంధనలు పాటించకుండా కబ్జాలు చేసినట్లు పేర్కొంది హైడ్రా.