- మేడిపల్లిలో 68 ప్లాట్లతో షురూ
- 29 న మోకిలాలో.. జులై 2న బంజారాహిల్స్లో 8 ఎకరాల వేలానికి రెడీ
- ఎకరానికి కనీస ధర 99 కోట్లు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో భూముల వేలానికి హెచ్ఎండీఏ రెడీ అయ్యింది. నిధుల లేమితో అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండగా, వాటిని పట్టాలెక్కించేందుకు భూముల వేలం ద్వారా రూ.1500 కోట్లను రాబట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా బుధవారం మేడిపల్లిలోని సర్వే నంబర్62లో 68 ప్లాట్లు వేలానికి పెట్టింది.
ఇక్కడ 231.66 నుంచి 643.22 చ. గ. సైజుల్లో ప్లాట్లను అమ్మనున్నారు. చ.గజానికి 45వేలుగా నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిలలోని సర్వే నంబర్96/పిలో 100 ప్లాట్లను వేలం వేయనున్నది. ఇక్కడ కూడా మేడిపల్లి తరహాలోని ప్లాట్ల సైజులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూముల ధరలకు మంచి డిమాండ్ఉండడంతో చ. గ. నికి కనీస ధర 50వేలుగా నిర్ణయించింది.
బంజారాహిల్స్ హాట్ కేక్
నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్లో 8.24 ఎకరాల భూమికి జూలై 2న వేలం వేయనుండగా, ఎకరానికి కనీస ధరనే రూ. 99 కోట్లుగా నిర్ణయించారు. గతంలో కోకాపేటలో అత్యధికంగా ఎకరానికి రూ.125 కోట్లు పలికింది. బంజారాహిల్స్ భూమికి ఎకరానికి రూ.130 నుంచి రూ.150 కోట్ల వరకూ పలకవచ్చని భావిస్తున్నారు. ఇవే కాకుండా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిల్లో ఉన్న చిన్న చిన్న బిట్స్‌ను కూడా ఈ సారి వేలంలో చేర్చనున్నారు.
