
- ఉద్యోగినులపై వేధింపుల కట్టడికి చర్యలు
- సాహస్ మైక్రోసైట్ లాంచ్ చేసిన హోంమంత్రి
హైదరాబాద్,వెలుగు : రాష్ట్రంలోని మహిళా ఉద్యోగుల రక్షణ కోసం పోలీస్ డిపార్ట్‌మెంట్ విశేష కృషి చేస్తున్నదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఉమెన్ సేఫ్టీ కోసం షీ టీమ్స్, భరోసా తరహాలోనే ‘సాహస్’ అనే మరో కొత్త ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్‌సంస్థల్లోని ఉద్యోగినిలపై జరుగుతున్న వేధింపులను ‘సాహస్’ అరికడుతుందని వెల్లడించారు. శుక్రవారం బేగంపేట్‌లోని ఐటీసీ కాకతీయలో డీజీపీ అంజనీకుమార్, ఉమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్ శిఖా గోయల్‌తో కలిసి హోంమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ.. వర్క్ ప్లేసెస్‌లో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలను సాహస్ మైక్రోసైట్ కాపాడుతుందని చెప్పారు. ఇది దేశంలో మొట్టమొదటిదని తెలిపారు. దీనిపై ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలకు,ఉద్యోగినులకు అవగాహన కలిగిస్తామన్నారు. షీ టీమ్స్, భరోసా తరహాలోనే సాహస్ స్టీరింగ్ కమిటీ కూడా మహిళలకు రక్షణగా ఉంటుందని మంత్రి వివరించారు. వర్క్ ప్లేస్‌లో ఎలాంటి సమస్యలు ఎదురైనా మహిళలు ఈ సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ...వర్క్ ప్లేస్‌లో వేధింపులకు గురవుతున్న మహిళలు, యువతులకు ‘‘సాహస్” అండగా నిలుస్తుందన్నారు. అడిషనల్ డీజీ శిఖా గోయల్ మాట్లాడుతూ...రాష్ట్రంలో షీ-టీమ్స్, భరోసా కేంద్రాలు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. సాహస్ మైక్రోసైట్, సాహస్ సాతి, చాట్‌బోట్, సాహస్ నంబర్, ఫోరమ్, ఆన్‌లైన్ సపోర్ట్ ద్వారా వర్క్ ప్లేసెస్‌లో మహిళల సేఫ్టీ పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ మిస్ ఇండియా మానస వారణాసి, సీఐఐ చైర్మన్ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.