హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. టెర్రరిస్టుల కదలికలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు సిటీలో ఆరుగురిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన విషయాన్ని వెల్లడించారు. సిటీ సౌత్ ఈస్ట్ జోన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఐఎస్ సదన్ పీఎస్‌తో పాటు రెనోవేషన్ చేసిన సైదాబాద్, సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్లను హోంమంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసుల కంటే తెలంగాణ పోలీసులు నంబర్ వన్ స్థానంలో ఉన్నారని అన్నారు. ఏటీఎస్‌కు పట్టుబడ్డ వారికి చెందిన పూర్తి వివరాలు రాబడుతున్నామని తెలిపారు. సిటీ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు.
లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉంది : డీజీపీ
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, క్రైమ్ కంట్రోల్‌లో ఉందని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. మల్టీనేషనల్ కంపెనీల పెట్టుబడులతో రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని వివరించారు. సిటీలో ఏడాది పొడవునా జరిగిన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించిన పోలీసులను అభినందించారు. భవిష్యత్ తరాలకు సిటీని మరింత సేఫ్ అండ్ సెక్యూరిటీతో అందిస్తామని స్పష్టం చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను బలోపేతం చేస్తున్న సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీకి సీపీ సీవీ ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ స్టేషన్స్ నిర్వహణకు నెలవారీ బడ్జెట్, కొత్త పోలీస్‌స్టేషన్స్, షీ టీమ్స్, కొత్త వెహికల్స్ అందించడంతో సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరిగిందన్నారు.
