తేనెను తయరుచేసే చీమలు

 తేనెను తయరుచేసే చీమలు

ఈ ప్రపంచంలో తేనెటీగలు మాత్రమే తేనెను తయారుచేస్తాయని అందరూ అనుకుంటారు. కానీ, ఆస్ట్రేలియాలోఉండే హనీ పాట్ చీమలకు కూడా తేనెను తయారుచేయడం తెలుసు. అంతేకాదు, ఇవి వాటి పొట్టలోనే తేనెను దాచుకుంటాయి.  హనీ పాట్ చీమలు చూడ్డానికి మామూలు చీమల్లాగానే ఉంటాయి. కానీ, వీటికి పొట్ట ఉబ్బి ఉంటుంది. అందులోనే అవి తేనె దాచుకుంటాయి. ఈ పొట్ట అరంగుళం సైజులో పెరుగుతుంది.  తేనెటీగల్లాగానే ఇవి కూడా పూల నుంచి మకరందాన్ని సేకరించి వాటిని తేనెగా మారుస్తాయి. చీమలు పెరిగే కొద్దీ వాటి పొట్టలో తేనె కూడా పెరుగుతుంది. 

మోయలేనంత తేనె పోగవ్వగానే అవి వాటి కాలనీల్లోకి వెళ్లిపోయి అక్కడ గోడలకు అతుక్కుపోతాయి. కాలనీలో ఉండే ఇతర చీమలు ఆ తేనెను తాగుతాయి. ఎడారిలో తినడానికి ఏమీ దొరకనప్పుడు బతకడం కోసం ఇలా తేనెను దాచుకుంటాయి. ఆస్ట్రేలియా, మెక్సికో, ఆఫ్రికాలోని ఎడారుల్లో ఈ చీమలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటి గురించి తెలిసినవాళ్లు అవి కనిపించగానే వాటిని పట్టుకుని నోట్లో వేసుకుంటారు. చీమల తేనె పలుచగా ఉంటుంది. ఇందులో ఫ్రక్టోజ్ కంటే గ్లూకోజ్ ఎక్కువ. తేనెటీగల తేనెలో ఫ్రక్టోజ్ ఎక్కువ. అయితే ఈ రెండు తేనెల్లో యాంటీ  ఆక్సిడెంట్స్ మాత్రం ఎక్కువే.