- హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్
జహీరాబాద్, వెలుగు: ఇందిరమ్మ గృహ లబ్ధిదారులందరూ నిర్దేశిత గడువులోగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని సదాశివపేట, కోహిర్, జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లోని గ్రామాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులను కలిసి ఇసుక సరఫరా, బిల్లుల చెల్లింపులు, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ దశలను బట్టి వెంటనే బిల్లులు చెల్లిస్తున్నామని, ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. సమావేశంలో హౌసింగ్ జిల్లా పీడీ చలపతిరావు, ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ డీఈలు, ఈఈలు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు పాల్గొన్నారు.
