సొంతింటి కల.. ఇంకొంత దూరం..

సొంతింటి కల.. ఇంకొంత దూరం..

చిన్నదైనా, పెద్దదైనా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. కలో గంజో తాగి సొంత గూట్లో ఉంటే చాలని అందరూ అనుకుంటారు. కానీ సొంతింటి కల నిజం చేసుకోవడం ఈ ఏడాది మరింత కష్టం కానుందని క్రెడాయ్ సర్వే చెబుతోంది. పెరుగుతున్న ధరలు మధ్యతరగతి వారి సొంతింటి కలను మరింత భారంగా మార్చుతాయని అంటోంది. క్రెడాయ్, కొలియర్స్ ఇండియా, రియల్ ఎస్టేట్ రీసెర్చ్ కంపెనీ లియాసెస్ ఫోరాస్ రెండు నెలల పాటు నిర్వహించిన సర్వేలో 341 రియల్ ఎస్టేట్ డెవలపర్లు అభిప్రాయాలతో రిపోర్టు రెడీ చేసింది.

ఇండ్ల ధరలు పెరగొచ్చు 

సర్వే రిపోర్టు ప్రకారం ఈ ఏడాది ఇండ్ల ధరలు పెరుగుతాయని 58శాతం రియల్ ఎస్టేట్ డెవలపర్లు చెబుతున్నారు. పెరుగుతున్న నిర్మాణ ఖర్చులే ఇందుకు కారణమని అంటున్నారు. అయితే 32శాతం మంది డెవలపర్లు మాత్రం రేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.  ఇక ఇండ్ల డిమాండ్ విషయానికొస్తే సర్వేలో పాల్గొన్న వారిలో 43శాతం మంది ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని చెప్పారు. 31శాతం మంది మాత్రం రెసిడెన్షియల్ డిమాండ్ 25 శాతం వరకు పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. 

గతేడాది 1020 శాతం పెరిగిన ఖర్చు

నిర్మాణ ఖర్చులతో పాటు డిమాండ్  పెరగడంతో గత కొన్ని త్రైమాసికాలుగా ఇండ్ల ధరలు పెరుగుతున్నాయని సర్వే రిపోర్టు చెబుతోంది. సిమెంట్, స్టీల్ ధరల పెరుగుదల కారణంగా 2022లో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం 1020శాతం పెరిగినట్లు 43శాతం మంది డెవలపర్లు చెప్పారు. ప్రభుత్వాలు ప్రోత్సహకాలు అందించాలని రియల్ ఎస్టేట్ రంగ  నిపుణులు కోరుతున్నారు. వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ జనం ఇండ్ల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని, అందుకే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొత్త ప్రాజెక్టులు లాంఛ్ చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నాయన్నది కొలియర్స్ ఇండియా సీఈఓ రమేష్ నాయర్ అభిప్రాయం. 

మాంద్యం ప్రభావం ఉండకపోవచ్చు..!

ఆర్థిక మాంద్యం భయాలు తమ వ్యాపారంపై మోస్తరు ప్రభావం చూపవచ్చని సర్వేలో పాల్గొన్న 46శాతం సంస్థలు అభిప్రాయపడ్డాయి. 31శాతం కంపెనీలు మాంద్యం ప్రభావం అత్యల్పంగా ఉంటుందని చెప్పగా.. 15శాతం డెవలపర్లు మాత్రం తీవ్రమైన ప్రభావం ఉండొచ్చని చెప్పాయి. 

జనాభా పెరుగుదల, సంపద వృద్ధి, వేగవంతమైన పట్టణీకరణ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి కీలకంగా మారాయి : హర్ష వర్థన్ పటోడియా,  క్రెడాయి ప్రెసిడెంట్

2022లో అత్యధికంగా ఇండ్లు అమ్ముడుపోవడంతో పాటు పెద్ద నగరాల్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ప్రాపర్టీ రేట్ల విషయంలోనూ కొంత పెరుగుదల నమోదైంది. 2023లోనూ ఇదే ఒరవడి కొనసాగుతుందని భావిస్తున్నా : పంకజ్ కపూర్, లియాసెస్ ఫోరాస్ ఎండీ