న్యూయార్క్: బెలారస్ స్టార్ ప్లేయర్ అరీనా సబలెంక.. యూఎస్ ఓపెన్ విమెన్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన సింగిల్స్ ఫైనల్లో రెండోసీడ్ సబలెంక 7–5, 7–5తో ఆరోసీడ్ జెసికా పెగులా (అమెరికా)పై గెలిచింది. సబలెంక కెరీర్‌లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. గతేడాది ఇదే టోర్నీలో ఫైనల్లో, అంతకుముందు రెండేళ్లలో రెండుసార్లు సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టిన సబలెంక ఈసారి ట్రోఫీతో కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకుంది. గంటా 53 నిమిషాల మ్యాచ్‌లో బలమైన సర్వీస్‌లు, షాట్ వేరియేషన్స్‌తో చెలరేగింది. మ్యాచ్ మొత్తంలో ఆరు ఏస్‌లు కొట్టిన సబలెంక.. ఐదు డబుల్
ఫాల్ట్స్ చేసింది. 15 బ్రేక్ పాయింట్లలో ఆరింటిని కాచుకుంది. 40 విన్నర్స్ సాధించగా, 34 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసింది. ఇక 4 ఏస్‌లు, 4 డబుల్ ఫాల్ట్స్ చేసిన పెగులా నాలుగే బ్రేక్ పాయింట్లను కాచుకుంది. 17 విన్నర్లకే పరిమితమైంది. గత 28 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క పోరు (2023 యూఎస్ ఓపెన్ ఫైనల్)లో విఫలమైన సబలెంక సూపర్ ఫామ్‌తో ఫైనల్లోకి అడుగుపెట్టింది. అదే జోరుతో అందని ద్రాక్షగా మారిన టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఐదేళ్ల కిందట తండ్రిని, ఈ ఏడాది మార్చిలో బాయ్‌ఫ్రెండ్‌ను కోల్పోయిన సబలెంక ఓ దశలో తీవ్ర ఒత్తిడికి లోనైంది. కానీ తన ఫ్యామిలీ పేరును టెన్నిస్ చరిత్రలో లిఖించాలనే లక్ష్యంతో మళ్లీ ఆట మొదలుపెట్టి గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకుంది.