ఇప్పుడు నడుస్తున్నదంతా యూట్యూబ్ పాటల యుగం. పాటంటే 2014కు ముందువరకు కూడా ఉద్యమపాటే. నలుగురు కలుసుకుంటే పాట. నలభైమంది రోడ్డెక్కితే పాట. నాలుగు వేల మంది ఒక చోట సభ పెడితే పాట. పాటలేని తెలంగాణ ఉద్యమం లేదు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిన పాట ఇవాళ మరో మలుపు తిరుగుతున్నది. ఆలోచింపజేసే దశ నుండి అలరించే దశకు చేరుకుంటున్నది. ఈ విధంగా పాట కొత్తపుంతలు తొక్కుతున్నది. ఇది లాభమా? నష్టమా? అనే చర్చ పక్కకు పెడితే కొత్త గొంతుకలు పుట్టుకొచ్చాయి. కొత్త గొంతులే కాదు కొత్త కలాలు, కొత్త సంగీత దర్శకులు కూడా పుట్టుకొచ్చారు. ఇంతమంది సమిష్టి కృషి వల్ల నిత్యం అనేక కొత్త పాటలు ఏదో మూలన వెలువడుతూనే ఉన్నాయి. ప్రజలకు క్షణాల్లో చేరిపోతూనే ఉన్నాయి. ఇట్లా ఈ యూట్యూబ్ పాటల యుగం సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నది.
ఒకప్పుడు ఉద్యమం కోసం బతుకమ్మను, బోనాలను పాటలకెత్తిన ట్రెండ్ ఇవాళ ఒక సంప్రదాయంగా మారింది. కొత్తగా కలం పట్టిన రచయితలు ఏం రాయాలో అని ఆలోచించుకునే సమయంలో తమ కంటే ముందు పాటలు రాసిన వాళ్ల విజయం వీరిని తొందరపెడుతున్నది. జానపదమో, ప్రేమ విరహగీతమో రాయమని వీరి వెంటపడుతున్నది లేకుంటే బతుకమ్మ వారి ముందుకొచ్చి కూర్చుంటున్నది. బోనాల సందడి పాటై పోటెత్తుతున్నది.
రాష్ట్ర అవతరణ వేడుక రంగు రంగుల పాటై కనువిందు చేస్తున్నది. మహనీయుల జన్మదినాలు పాటై మార్మోగుతున్నాయి. శివరాత్రికి, సంక్రాంతికి, పంద్రాగస్టుకి, ఏప్రిల్ 14కు, జూన్ 2కు ఇట్లా ప్రతీ సందర్భమూ పాటే. ఇది ఎంతలా విస్తరించిందంటే టీవీ చానెళ్లు సైతం, ప్రతీ పండుగకు ఏదో ఒక కొత్త పాట ప్రసారం చేయకుంటే వెనకబడి పోతామేమో అని ఖంగారు పడేలా చేస్తున్నది ఈ ట్రెండ్. ఏది ఏమైనా పాటకు, జానపదానికి మళ్లీ ఒక కొత్త శక్తి ఈ పాటల రూపంలో అందివస్తున్నది.
అయితే... ఇక్కడే అసలు సమస్య ఉంది. వరుసగా రిలీజ్ అవుతున్న ఈ పాటల్లో ఉన్న సాహిత్యం ఎంత? తప్పులు ఎన్ని? ఒప్పులు ఎన్ని? పాత భావాలు, పాత బాణీలు కాపీ కొడుతున్నవి ఎన్ని? అనుకరణలు ఎన్ని? అవసరాలు ఎన్ని అనే విషయాన్ని గానీ... ఒక మంచి పాట రాయడానికి బాణి ముఖ్యమా? భావం ముఖ్యమా? కొత్త పాటల్లో కొత్తదనం కావాలంటే ఏం చేయాలి? కవిత్వం పాలు పాటలో సరిపోయేంతగా ఉందా? వంటి అనేక విషయాలు విడమరిచి చెప్పేవాళ్లే లేరు.
దీంతో కొత్తగా కలం పట్టినవాళ్లు చీకట్లోకి బాణం వేసినట్టు, జనాల మీదికి ఒక పాటను వదులుతున్నారు. అందులో తప్పుడు సాహిత్యంగానీ, తక్కువ సాహిత్యంగానీ ఉంటే మళ్లీ ఆ బాణాన్ని వెనక్కి తీసుకోలేము. ఇంకేముంది ఒక్కసారి ప్రజల్లోకి వెళ్లిన పాట మళ్లీ వెనక్కి రావడం కుదరదు. ముందే చెక్ చేసుకునే ఓపికగానీ, ఆలోచనగానీ లేని రచయితలే ఎక్కువమంది ఉంటున్నరు. ఈ పరిస్థితిని చక్కదిద్దవలసిన బాధ్యత పాటకవులదే. కానీ, వారు కొత్తతరానికి చెయ్యి అందించే బదులు చెయ్యి ఇస్తున్నరు.
ఎక్కడ తమ జూనియర్లకు తమకంటే ఎక్కువ పేరొస్తదో అని పలానా పాట బాగా రాశాడని... మాట వరుసకైనా పొగిడే పరిస్థితి లేదు. ఇన్ని కారణాల వల్ల కొత్తగా రాసే పాటల రచయితల పరిస్థితి అయోమయంగా ఉంది. ఇవాళ చాలామందికి పాటల రచయితలకు రాత్రికి రాత్రే ఒకే ఒక్క పాటతో గొప్ప పేరు తెచ్చుకొని సెలబ్రిటీ కావాలని ఉంది. ఇది మానవనైజం. తోటివారికంటే భిన్నంగా, ప్రతిభావంతంగా ఉంటారు క్రియేటివ్ పర్సన్స్. మరి పేరు తెచ్చుకోవాలనే ఉబలాటపు కోరిక తీరాలంటే ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియక ఆగమవుతున్నారు.
కావాల్సినంత సాధనగానీ, చదవాల్సిన సాహిత్యంగానీ, రాసినదాన్ని మెరుగుపరుచుకునే ఓపికగానీ వారికి ఉండడం లేదు. ఎలాగైనా సరే తమ పాటలకు లక్షలు దాటి మిలియన్లలో వ్యూస్ రావాలి. తనను జనం గుర్తించాలి. ఆదరించాలి. తనతో సెల్ఫీలు దిగేటంత సెలబ్రిటీని కావాలనుకునే విపరీత ధోరణి విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి వారందరిని తొవ్వలో పెట్టాలి. వారితో మంచి పాటలు రాయించాలి. ఈ సమాజ విముక్తి కోసం మంచి పాటలు రాసిన వారి అనుభవం ఏం తెలుపుతున్నదో తెలుసుకోవాలి.
ఆయా సామాజిక ఉద్యమాల్లో పాట పోషించిన పాత్రను గురించి పరిచయం ఉండాలి. మంచి పాటకు, మామూలు పాటకు ఉన్న తేడా, తాత్కాలిక పాటకు...శాశ్వత పాటలకు ఉన్న బేధం అర్థం చేసుకోవాలి. పాట నాలుగు కాలాలు నిలిచిపోవాలంటే ప్రతీ పాటను ఒక కళాఖండంగా తీర్చిదిద్దుకోవాలి. ఇలా మీరు మంచి పాట రాయాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. పాట రాయడానికి పల్లవి ఎలా ఉండాలి? చరణాల్లో ఏం చెప్పాలి? బాణి ఎలా కట్టాలి? పాట ద్వారా ఎలాంటి సందేశాన్ని అందివ్వాలి వంటి విషయాల్లో ఒక ప్రాథమిక అవగాహన ముఖ్యం.
పాట ఎందుకు రాయాలి? పాట ఎలా రాస్తారు? పాటలో సాహిత్యం అంటే ఏమిటి? బాణీలు ఎక్కడ దొరుకుతాయి? పాట రాయడాన్ని సాధన చేయడం ఎలా? పాటకు ప్రచారం ఎలా? ఏది గొప్ప పాట? పాటలో ఏమేమీ ఉండాలి? ప్రపంచ పాట నేర్పుతున్న అనుభవాలు ఏమిటి? ప్రస్తుత పాట పయనం ఏమిటి? అనే విషయాలను పాటకవులు ఆలోచించాలి. అప్పుడే మరింత లోతుగా పాట రాయడానికి కావాల్సిన అవగాహన విస్తృతమవుతుంది. మరింత వివరంగా వారం వారం ఈ కాలమ్ ద్వారా అందిస్తాను.
- డా.పసునూరి రవీందర్
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత
77026 48825
