నడుచుకుంటూ వెళ్లే వాళ్లను ఆపలేం: సుప్రీం కోర్టు

నడుచుకుంటూ వెళ్లే వాళ్లను ఆపలేం: సుప్రీం కోర్టు
  • వలస కూలీల అంశం రాష్ట్రాలు చేసుకోవాలి

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ వల్ల పనులు కోల్పోయి, ట్రాన్స్‌పోర్ట్‌ లేకపోవడంతో సొంత రాష్ట్రాలకు నడిచి వెళ్తున్న వలస కూలీలను ఆపలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎవరు నడిచి వెళ్తున్నారు, ఎవరు వెళ్లడం లేదనే విషయం సమీక్షించడం కోర్టుకు కుదరని పని అని జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వర రావుతో కూడిన బెంచ్‌ చెప్పింది. రైళ్లు బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూలీలు సొంత రాష్ట్రాలకు నడిచి వెళ్తున్నారని వలస కూలీలను గుర్తించి, వారికి ఆహారం, ఆశ్రయం కల్పించాలని లాయర్‌‌ అలోక్‌ శ్రీవాస్తవా వేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారించింది. వలస కూలీల అంశంలో రాష్ట్రాలే స్పందించాలని, నడుచుకుంటూ వెళ్లేవారు ఆగడం లేదని, వారిని మేం ఎలా ఆపగలం అని కోర్టు చెప్పింది. రైల్వే ట్రాక్‌పై నిద్రించే వారిని ఎవరు రక్షిస్తారని మహారాష్ట్ర ప్రమాదంలో కోర్టు అభిప్రాయపడింది. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో పనులు లేక, ట్రాన్స్‌పోర్ట్‌ లేక చాలా మంది వలస కూలీలు రోడ్డు మార్గంలో వేల కిలోమిటర్లు నడిచి సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దారిలో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.