
- న్యాయవాది రామారావు ఇమ్మానేని పిటిషన్ పై విచారణ
- 28న హైదరాబాద్లో బహిరంగ విచారణకు నిర్ణయం
పద్మారావునగర్, వెలుగు: పెద్దదన్వాడ ఘటనపై మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ డాక్టర్ జితేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. -వారంలోగా రైతులపై పెట్టిన అక్రమ కేసులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
పెద్ద ధన్వాడలో ఎథినాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధానికి గురిచేశారంటూ న్యాయవాది రామారావు ఇమ్మానేని పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కమిషన్ ఈ నెల 28న హైదరాబాద్ లో ఉదయం 10 గంటల నుంచి బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. పిటిషనర్, రైతులు, కేసులు ఎదుర్కొంటున్న వారితో పాటు కుటుంబ సభ్యులు, ఇతర ప్రత్యక్ష సాక్షులు విచారణలో పాల్గొనాలని కమిషన్ ఆదేశించింది.
ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధితుల తరఫున సాక్షులు విచారణకు వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ఆదేశాలు అందిన వారంలో చర్యలు తీసుకొని అత్యవసర నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ డాక్టర్ జితేందర్ ను కమిషన్ కోరింది.