రామంతాపూర్ విద్యుత్ షాక్ ఘటనపై HRC సీరియస్.. సుమోటోగా కేసు స్వీకరణ

రామంతాపూర్ విద్యుత్ షాక్ ఘటనపై HRC సీరియస్.. సుమోటోగా కేసు స్వీకరణ

హైదరాబాద్‌: హైదరాబాద్‌ రామంతపూర్‌లో శ్రీ కృష్ణుని శోభాయాత్రలో రథానికి కరెంట్​ తీగలు తగిలి షాక్​ కొట్టడంతో ఆరుగురు మృతి చెందిన ఘటనపై HRC (హ్యుమన్ రైట్స్ కమిషన్) సీరియస్ అయింది. సుమోటోగా కేసును స్వీకరించింది. హైదరాబాద్‌ రామంతపూర్‌లో కృష్ణ జన్మాష్టమి శోభ యాత్రలో ఆరుగురి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదకరమని HRC దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనకు కారణం, అధికారుల నిర్లక్ష్యం, తక్షణ పరిష్కార చర్యలు, బాధితుల కుటుంబాలకు పరిహారం.. భద్రతా చర్యలపై సెప్టెంబర్ 22వ తేదీ లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని TSSPDCL సీఎండీకి ఆదేశాలు జారీ చేసింది.

రామంతాపూర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా రాత్రివేళ గోకుల్​నగర్​యాదవ సంఘం దగ్గర శోభాయాత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వందలమంది యాదవులు, ఇతర కులస్తులు పాల్గొని పూజలు చేశారు. సంబురంగా పిల్లలతో ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. రాత్రి 9 గంటలకు రథంలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఉంచి.. శోభాయాత్ర మొదలుపెట్టారు. 

ఈ యాత్ర గోకుల్​నగర్​యాదవ సంఘం నుంచి ప్రారంభమై  ఓల్డ్ రామంతాపూర్, ఆర్టీసీ కాలనీ, శారదనగర్ మీదుగా సాగింది. రాత్రి 12.15 గంటలకు గోకుల్ నగర్ యాదవ సంఘానికి చేరే క్రమంలో రథాన్ని లాగే వెహికల్ మొరాయించింది. ఎంతకీ స్టార్ట్ అవ్వకపోవడంతో దగ్గరలోనే ఉంది కదా అని సుమారు15 మంది రథాన్ని మండపానికి లాగే ప్రయత్నం చేశారు. అదే సమయంలో జోరుగా వర్షం పడుతున్నది.

పై భాగంలో వేలాడుతున్న కేబుల్​వైర్‌‌‌‌కు తాకి రథం ముందుకు వెళ్లలేదు. దీంతో కర్రలతో ఆ కేబుల్ వైర్ను పైకి లేపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మెయిన్ వైరు తెగి రథానికి తాకడంతో ముందు ఇనుప కడ్డీని లాగుతున్న ఐదుగురు ఎగిరిపడ్డారు. వారిని పట్టుకుని ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

కేబుల్​వైర్‌‌‌‌కు సపోర్టింగ్‌‌గా కట్టే జే వైరుకు రథం తాకిందని, ముందుకు వెళ్లనివ్వడంతో జే వైర్ తెగి ఎల్‌‌టీ కరెంట్​వైర్లకు తాకడంతో షాక్​ కొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ టైంలోనే రథంపై పూజారి, ఇతర వ్యక్తులు ఉన్నా వారికి ప్రాణాపాయం తప్పింది. ముందు భాగం కాకుండా మిగతా చోట్ల పట్టుకున్నవారెవరికీ షాక్​కొట్టలేదు. ఈ దుర్ఘటనలో కరెంట్ షాక్ తగిలి మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.