బషీర్‌బాగ్, వెలుగు: బాచుపల్లిలోని ప్రణవ్ ఆంటిలియా విల్లాల్లో హైడ్రా చేపట్టిన చర్యలు, అనంతరం అక్కడి మహిళలపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌ను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ నెల 9న హైడ్రా అధికారులు తమకు కనీస సమయం ఇవ్వకుండా ప్రహరీ గోడను కూల్చివేశారని, జనరేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తరలించేందుకు సమయం కోరిన మహిళలపై దాడి చేసి నెట్టివేశారని నివాసితులు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మహిళలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ట్రోలింగ్, రాజ్యాంగంలోని జీవించే హక్కు, గౌరవం, గోప్యత హక్కుల ఉల్లంఘనగా కమిషన్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో ట్రోలింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.
అలాగే విల్లాల్లో వీధి దీపాలను పునరుద్ధరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను, దానికి సహకరించాలని విద్యుత్ అధికారులకు స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యల నివేదికను ఏప్రిల్ 7లోగా సమర్పించాలని కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ షామీమ్ అక్తర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రోడ్డు ఎవరు వేశారో నివేదిక ఇవ్వండి: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నిజాంపేట, బాచుపల్లిలోని ఏపీ ప్రణవ్ యాంటిల్లా గేటెడ్ కమ్యూనిటీ వద్ద రోడ్డు ఎవరు వేశారో విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని బాచుపల్లి, దుండిగల్, జగద్గిరిగుట్ట ఎస్‌హెచ్‌ఓలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గేటెడ్ కమ్యూనిటీకి చెందిన కాంపౌండ్‌ను హైడ్రా కూల్చివేసి రోడ్డు వేసిందంటూ పిటిషనర్లు ఆరోపిస్తుండగా రోడ్డు నిర్మించలేదని హైడ్రా చెబుతున్నందున అసలు రోడ్డు ఎవరు వేశారో చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.
