స్కూల్ సమీపంలో భారీగా పేలుడు పదార్థాలు.. 161 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

స్కూల్ సమీపంలో భారీగా పేలుడు పదార్థాలు.. 161 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

న్యూఢిల్లీ: ఓ స్కూల్ వద్ద భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్‎లోని అల్మోరా జిల్లా డాబరా గ్రామంలో గవర్నమెంట్ హైస్కూల్ సమీపంలోని పొదల్లో ఆ పేలుడు పదార్థాలు దొరికాయి. స్కూల్ ప్రిన్సిపాల్ సుభాష్ సింగ్ ముందుగా పేలుడు పదార్థాలను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని సీజ్  చేశారు. తర్వాత ఉధమ్ సింగ్ నగర్, నైనిటాల్ జిల్లాల నుంచి బాంబ్, డాగ్ స్క్వాడ్​లను రప్పించారు.

 బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు పొదలను పరిశీలించగా కొన్ని జిలెటిన్  స్టిక్స్ దొరికాయి. కొద్దిదూరంలోనే మరికొన్ని జిలెటిన్  స్టిక్స్ లభ్యమయ్యాయి. మొత్తం 161 జిలెటిన్ స్టిక్స్‎లను స్వాధీనం చేసుకున్నారు. వాటి బరువు 20 కిలోలు ఉందని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు హైఅలర్ట్  ప్రకటించారు. స్కూల్ సమీపంలోకి పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి, ఎవరు వాటిని తీసుకొచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీనియర్  సూపరింటెండెంట్  పోలీస్  దేవేంద్ర పించా మీడియాకు వెల్లడించారు. 

జిలెటిన్  స్టిక్స్‎ను సురక్షిత ప్రాంతానికి తరలించామని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఇటీవలే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు సంభవించి 15 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. అంతకుముందు హర్యానాలో 3 వేల కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‎లోని స్కూల్  వద్ద జిలెటిన్ స్టిక్స్ దొరకడం కలకలం రేపింది. కాగా.. జిలెటిన్ స్టిక్స్​ను మైనింగ్, కొండలను బ్లాస్ట్  చేయడానికి వాడుతారు.