- దేశవ్యాప్తంగా వేల మంది ఇన్వెస్టర్స్
- సైబరాబాద్ పోలీసులకు 10 మంది బాధితుల ఫిర్యాదులు
- రూ. 6 నుంచి 7 కోట్ల వరకు నష్టపోయిన బాధితులు!
హైదరాబాద్,వెలుగు : భారీ స్టాక్ బ్రోకింగ్ స్కామ్ వెలుగు చూసింది. పెట్టుబడిలో ఏడాదికి 120 శాతం, ఆరు నెలలకు 54 శాతం వడ్డీ ఇస్తామని నమ్మించి ఆన్‌లైన్ అడ్డాగా డీబీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కొనసాగించిన మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థలో ఏపీ, తెలంగాణలో దాదాపు 20 వేల మంది బాధితులు పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు తెలిసింది.
డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో మోసపోయిన 10 మంది బాధితులు గత నెల 23న సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు దీపాంకర్ బర్మన్‌పై లుక్ అవుట్ సర్క్యులర్(ఎల్‌ఓసీ) జారీ చేశారు. అసోంలో ప్రధాన కేసులు రిజిస్టర్ కావడంతో ఆ రాష్ట్ర పోలీసులతో సైబరాబాద్ పోలీసులు కోర్డినేట్ చేసుకుంటున్నారు.
గువహటి కేంద్రంగా 2018 నుంచి..
డీజీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అసోం రాజధాని గువహటి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. సంస్థ నిర్వాహకుడు దీపాంకర్ బర్మన్(29) ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌లో స్టాక్ బ్రోకింగ్ ఆఫర్ చేస్తున్నాడు. తమ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు ఇస్తామంటూ ప్రచారం చేశాడు. ఏడాదికి 120 శాతం, ఆరునెలలకు 54 శాతం, నెలకు 7 శాతం వడ్డి చెల్లింపు పాటు అతి తక్కువ సమయంలో ఇన్వెస్ట్‌మెంట్స్ రిటర్న్ చేస్తామని నమ్మించాడు. ఇలా 2018 నుంచి దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఇన్వెస్టర్స్‌ను సేకరించాడు.
గువహటి,బెంగళూరు, ముంబై, ఢిల్లీ,హైదరాబాద్ సహా మెట్రో సిటీస్‌లో ఇన్వెస్టర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. హెడ్ ఆఫీస్ గువహటిలో ఉండగా మెట్రో సిటీస్‌లో తాత్కాలిక ఆఫీస్‌లు ఏర్పాటు చేశాడు.
జూన్ నుంచి నిలిచిపోయిన ఆపరేషన్స్
కూకట్‌పల్లి కేపీహెచ్‌బీలోనూ ఓ బ్రాంచ్ ఆఫీస్ పెట్టాడు. అట్రాక్ట్ చేసే ఆన్‌లైన్ ఆఫర్స్‌తో ఇన్వెస్టర్స్ తో స్టాక్ బ్రోకింగ్ చేశాడు. మణికొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పంచాక్షర్(37) డీబీలో స్టాక్ బ్రోకింగ్ చేశాడు. రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తక్కువ సమయంలో లాభాలు,వడ్డీ చెల్లింపులు ఇస్తామని చెప్పినప్పటికీ డీబీ నుంచి ఎలాంటి ఆదాయం రాలేదు. 2022, డిసెంబర్ లో రూ. 88.5 లక్షలు పెట్టుబడి పెట్టిన గంటాడి హరీశ్‌రెడ్డికి కొంత మేర వడ్డీ చెల్లింపులు జరిగినప్పటికీ ఆ తర్వాత నిలిచిపోయాయి.
ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ నుంచి డీబీ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయినట్లు బాధితులు గుర్తించారు. అసోంలో కేసులు నమోదైన తర్వాత నిర్వాహకులు పారిపోయినట్లు తెలుసుకున్నారు. దీంతో సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే పోలీసులకు అందిన ఫిర్యాదుల ఆధారంగా దాదాపు 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు బాధితులు నష్టపోయిన బాధితులను గుర్తించారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
