ఉద్యోగులకు కట్టలు కట్టలు నోట్లు పంచిన చైనా కంపెనీ

ఉద్యోగులకు కట్టలు కట్టలు నోట్లు పంచిన చైనా కంపెనీ

తమ కంపెనీలు బోనస్ ఇస్తున్నాయంటే ఏ ఉద్యోగికి అయినా సంతోషంగానే ఉంటుంది. అయితే కరోనా తర్వాత పరిస్థితులు భిన్నంగా మారాయి. బోనస్ విషయం పక్కన పెడితే ఉద్యోగం ఉంటే చాలు అన్నట్లు పరిస్థితులు తయారయ్యాయి. ఆర్థిక మాంద్యంతో పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే.. చైనాకు చెందిన హెనాన్ మైన్ అనే కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు భారీగా బోనస్ ప్రకటించింది. ఆ మొత్తాన్ని  ఓ కార్యక్రమం నిర్వహించి నగదును కట్టలు కట్టలుగా పేర్చి ఉద్యోగులకు అందించింది. పెద్ద మొత్తంలో బోనస్ ఒకేసారి చేతికి రావడంతో ఉద్యోగులు సంతోషంలో మునిగిపోయారు. 

హెనాన్ మైన్ కంపెనీ క్రేన్లను తయారు చేస్తుంటుంది. అయితే కరోనా సమయంలో పలు కంపెనీలు ఆర్థికంగా నష్టాల పాలయ్యాయి. కానీ, ఈ కంపెనీకి మాత్రం భారీగా లాభాలు వచ్చాయి. దీంతో కంపెనీ లాభాలకు కారణమైన ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా కంపెనీ సేల్స్‌ విభాగంలో మంచి పనితీరు కనబరిచిన 30 మందికి పైగా ఉద్యోగులకు 61 మిలియన్‌ యువాన్లు అంటే సుమారు రూ.73 కోట్లు బోనస్‌గా ప్రకటించింది. ఈ మొత్తాన్ని వారి బ్యాంక్ అకౌంట్ లో వేయకుండా.. ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి స్టేజ్ పై డబ్బుల కట్టలను పేర్చి వారికి అందించింది. 

అత్యుత్తమైన పనితీరు కనబరిచిన ముగ్గురు ఉద్యోగులకు ఒక్కో ఉద్యోగికి ఐదు మిలియన్‌ యువాన్లు అంటే సుమారు రూ. 6 కోట్లు చొప్పున అందించింది. మిగిలిన వారికి ఒక్కోక్కరికి ఒక మిలియన్‌ యువాన్లు అంటే సుమారు రూ.1.20 కోట్లు బోనస్‌గా ఇచ్చింది. దీంతో కంపెనీ అందించిన నోట్ల కట్టలను ఉద్యోగులు చేతులతో తీసుకెళ్లలేక బ్యాగులతో మోసుకెళ్లారు. అయితే.. దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.