
కూకట్ పల్లి,వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నాయకుడని, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఆయన పనిచేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర మోదీ అన్నారు. కూకట్ పల్లిలోని హుడా ట్రక్ పార్క్ స్థలంలో ఆదివారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సామాజిక వేత్త ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బీజేపీలో చేరారు.
ఆయనకు కిషన్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చొని పీఎం కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చారని, భూమి ఎక్కడ కనిపిస్తే అక్కడ బీఆర్‌ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రణాళిక ప్రకారం నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కూకట్ పల్లిలో బీజేపీకి మంచి పట్టు ఉందన్నారు. కార్యక్రమంలో ఈటల, మహారాష్ట్ర అంధేరి వెస్ట్ ఎమ్మెల్యే అమిత్ భాస్కర్ , మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్ రెడ్డి, పాల్గొన్నారు.