- నిరసన తెలుపుతున్న స్టూడెంట్లకు మద్దతుగా ఆర్డర్లు
- దేశంలోని పలు ప్రాంతాల నుంచి పంపుతున్న ప్రజలు
- హైదరాబాద్, ముంబై నుంచే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయన్న డెలివరీ బాయ్స్
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేస్తున్న ఆందోళనకు వినూత్న మద్దతు లభిస్తోంది. తాము స్వయంగా వెళ్లి నిరసనల్లో పాల్గొనే వీలులేని వారు ఆందోళనకు మద్దతుగా ఫుడ్ పంపిస్తున్నారు. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లిన వారు పస్తులు ఉండొద్దనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు.
పిజ్జాలు, బర్గర్లు, మోమోలు, సమోసాలు, థాలీలు, వాటర్ బాటిల్స్.. ఇలా వివిధ ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి ‘జంతర్ మంతర్’లో డెలివరీ చేయాలని, అక్కడున్న ఎవరికైనా సరే ఈ ఫుడ్ అందించాలని నోట్ పెడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయని ఫుడ్ డెలివరీ సిబ్బంది చెబుతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్, ముంబై నుంచే పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వచ్చినట్లు తెలిపారు. ఈ డెలివరీలతో నిరసన వేదిక వద్ద ఫుడ్ భారీగా పోగయింది. దీంతో ఆహారాన్ని వృధా చేయకుండా ఎవరికి నచ్చిన ఫుడ్ వారు తీసుకువెళ్లొచ్చంటూ సీజీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చిన వారికి సూచించారు.
20 సార్లు డెలివరీ చేశా..
ఆయు జాకబ్ అనే డెలివరీ ఏజెంట్ మంగళవారం ఉదయం నుంచి జంతర్ మంతర్ వద్దకు ఆహారం అందించడానికి ఏకంగా 20 సార్లు తిరిగినట్టు తెలిపారు. ఆ ఆర్డర్లలో నాలుగు ఆర్డర్లు నేరుగా అమెరికా నుంచి వచ్చినవేనని చెప్పారు. ఒకేసారి 80 పిజ్జాల భారీ ఆర్డర్ కూడా రావడంతో తమ రెస్టారెంట్ మేనేజర్ కూడా స్వయంగా డెలివరీ చేయడానికి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా నిరసనల్లో పాల్గొనలేని స్టూడెంట్లు కూడా ఆందోళనకారులకు మద్దతుగా ఫుడ్‌ను ఆర్డర్ చేస్తున్నారు.
ఢిల్లీకి వెళ్లలేక ఫుడ్ ఆర్డర్ పెట్టా..
బెంగళూరులో నర్సింగ్ చదువుతున్న బిహార్‌కు చెందిన ఒక విద్యార్థి గతంలో తాను నీట్ రాసినప్పుడు కూడా పేపర్ లీక్ అయిందని వెల్లడించారు. ఆ తర్వాత నిరాశతో నర్సింగ్‌లో చేరానని, ప్రస్తుతం తాను స్వయంగా ఢిల్లీ వచ్చి నిరసనలో పాల్గొనలేకపోతుండటంతో స్టూడెంట్లకు మద్దతుగా పిజ్జాలు ఆర్డర్ చేశానని వివరించారు.
గోవింద్ (24) అనే మరో డెలివరీ బాయ్ జంతర్ మంతర్ ఏకంగా 18 సార్లు వచ్చి వెళ్లినట్టు తెలిపారు.10 కప్పుల టీ, 34 బర్గర్లు, 200 సమోసాలు డెలివరీ చేశానని చెప్పారు. రూ.20 డెలివరీ చార్జీకి గంట సమయం పట్టినప్పటికీ, విద్యార్థులు సరైన కారణం కోసమే పోరాడుతున్నారనే తృప్తితో లోపలికి వెళ్లి ఆహారాన్ని అందించినట్టు పేర్కొన్నారు.
ఇక చాలు.. ఫుడ్ పంపొద్దు ప్లీజ్: సీజేపీ
జంతర్ మంతర్ వద్దకు విపరీతంగా ఆహారం చేరుకుంటుండడంతో మంగళవారం రాత్రి సీజేపీ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టింది. ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజుకి సరిపడా ఆహారం వచ్చిందని, దయచేసి ఇకపై ఆన్‌లైన్‌లో ఫుడ్‌ను ఆర్డర్ చేయొద్దని విజ్ఞప్తి చేసింది.
