గోదావరిఖనిలో ప్రమాదంలో భర్త.. మనస్తాపంతో భార్య..వారం వ్యవధిలో దంపతులు మృతి

గోదావరిఖనిలో ప్రమాదంలో భర్త.. మనస్తాపంతో భార్య..వారం వ్యవధిలో దంపతులు మృతి
  • బిల్డింగ్‌‌‌‌ పైనుంచి పడి భర్తకు తీవ్ర గాయాలు
  • కోలుకోడేమోనని మరుసటి రోజు భార్య సూసైడ్​
  • చికిత్స పొందుతూ భర్త మృతి

గోదావరిఖని, వెలుగు: ఆరు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందిన ఘటన గోదావరిఖనిలో విషాదాన్ని మిగిల్చింది. గోదావరిఖని వన్‌‌‌‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం చంద్రపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కంబాల భూమయ్య కొడుకు కంబాల నరేశ్(34) సింగరేణిలో వారసత్వ ఉద్యోగిగా జీడీకే–1 ఇన్‌‌‌‌క్లైన్‌‌‌‌లో ట్రామర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. 14 నెలల క్రితం నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి మమత (29)ను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు.

దంపతులు గోదావరిఖని ఉదయ్‌‌‌‌నగర్‌‌‌‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఈ నెల 16న శివరాత్రి సందర్భంగా భార్యాభర్తలు కాళేశ్వరం ఆలయానికి వెళ్లి జాగారం చేసి వచ్చారు. 17న నరేశ్​నిద్రమత్తులో మొదటి అంతస్తు మెట్లపై నుంచి జారిపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చెవుల నుంచి రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు సింగరేణి దవాఖానకు, అక్కడి నుంచి కరీంనగర్‌‌‌‌లోని ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. తలలో రక్తం గడ్డ కట్టిందని, సర్జరీ చేసినా కోలుకునే అవకాశాలు చాలా తక్కువని డాక్టర్లు చెప్పారు.

భర్త బతకడేమోనని భార్య సూసైడ్​..

నరేశ్​ బతకడం కష్టమేనని డాక్టర్లు చెప్పడంతో మనస్తాపానికి గురైన మమత 17న కరీంనగర్ తీగలగుట్టపల్లి ప్రాంతంలోని హనుమాన్‌‌‌‌నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. సర్జరీ అనంతరం చికిత్స పొందుతూ నరేశ్​ 22న ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. 

నరేశ్​ కుటుంబ సభ్యులపై కేసు..

మమత ఆత్మహత్య ఘటనపై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో నరేశ్​కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. వరకట్నం కోసం వేధింపులకు గురిచేశారని, దవాఖాన వద్ద కూడా దూషించారని మమత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన ఏడాదికే భార్యాభర్తలు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.