దంపతులపై విరిగిపడిన చెట్టు .. భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

దంపతులపై విరిగిపడిన చెట్టు ..  భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

కంటోన్మెంట్, వెలుగు: హైదరాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ హాస్పిటల్ గేటు వద్ద విషాదం చోటు చేసుకున్నది. ట్రీట్​మెంట్ కోసం హాస్పిటల్​కు వచ్చిన దంపతులపై ప్రమాదవశాత్తు పెద్ద చెట్టు విరిగిపడింది. దీంతో భర్త స్పాట్​లోనే చనిపోగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను గాంధీ హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తూముకుంటకు చెందిన రవీందర్, సరళాదేవి భార్యభర్తలు. బొల్లారం త్రిషూల్ పార్క్​లోని ప్రభుత్వ స్కూల్​లో సరళాదేవి టీచర్​గా పని చేస్తున్నారు. రవీందర్ ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు.. కాగా, సరళాదేవి కొంత కాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నది. 

ట్రీట్​మెంట్ కోసం స్కూటర్​పై దంపతులిద్దరు కంటోన్మెంట్ హాస్పిటల్ వెళ్లేందుకు ఇంటి నుంచి స్కూటర్​పై బయలుదేరారు. హాస్పిటల్ మెయిన్ గేటు దాటి లోపలి రాగానే.. పెద్ద సుబాబుల్ చెట్టు వారిపై విరిగి పడింది. దీంతో ఇద్దరూ చెట్టు కింద ఇరుక్కుపోయారు. వెంటనే తోటి పేషెంట్లు, సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఇద్దరిని బయటికి తీశారు. అయితే, అప్పటికే రవీందర్ (54) చనిపోగా.. సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను అంబులెన్స్​లో గాంధీ హాస్పిటల్​కు తరలించారు. తర్వాత రవీందర్ డెడ్​బాడీని కూడా పోస్టు మార్టం కోసం గాంధీ మార్చురీకి తీసుకెళ్లారు. 

ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. రెండు, మూడు సెకన్లు ముందు వచ్చినా.. లేట్​గా వచ్చినా ప్రమాదం జరిగేది కాదని అక్కడివాళ్లు తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కంటోన్మెంట్ హాస్పిటల్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ పరిశీలించారు. ప్రమాదం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇలా ప్రమాదకరమైన చెట్లు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సిబ్బందిని ఆదేశించారు.

మూడు చెట్లు కట్ చేశాం

హాస్పిటల్​లో చాలా వరకు గుల్​మొహర్ చెట్లు ఉన్నాయి. మూడు చెట్లు ఎండిపోవడంతో వాటిని తొలగించాం. ప్రమాదానికి కారణమైన సుబాబుల్ చెట్టు పూలు, ఆకులతో పచ్చగానే ఉండటంతో దాన్ని అలాగే ఉంచాం. అయితే, ఇటీవల కురిసిన వర్షానికి చెట్టు వేర్లు బయటికి వచ్చి ఉంటాయి. దీంతో ప్రమాదం జరిగి ఉండొచ్చు. దంపతులిద్దరు స్కూటర్​పై హాస్పిటల్ లోపలికి రావడం.. అప్పుడే చెట్టు కూలడం.. క్షణాల్లో జరిగిపోయింది.

- డాక్టర్ రామకృష్ణ,  హాస్పిటల్ సూపరింటెండెంట్