పంజాగుట్ట, వెలుగు: అనుమానం పెనుభూతమైంది.. ఫోన్ మాట్లాడుతోందని భార్యను ఓ భర్త డంబెల్తో కొట్టి చంపాడు. సనత్ నగర్ ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన చంద్రభాను సామల్, సస్మిత సామల్(34) దంపతులు ఏడాది కాలంగా ఫతేనగర్లోని శివశంకర్ కాలనీలో నివసిస్తున్నారు.
సస్మిత ఎక్కువగా ఫోన్ మాట్లాడుతుందన్న ఉద్దేశంతో భర్త చంద్రభాను ఆమెపై తరచూ అనుమానం పెంచుకుని గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మరోసారి ఫోన్ విషయంలో వాగ్వాదం జరగడంతో.. ఆవేశానికి లోనైన భర్త ఇంట్లోని డంబెల్తో భార్య తలపై బలంగా మోదాడు.
తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం గాంధీకి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
