ఇండస్ట్రియల్  పార్కుకు సహకరించండి: కలెక్టర్  హైమావతి

ఇండస్ట్రియల్  పార్కుకు సహకరించండి: కలెక్టర్  హైమావతి
  • రైతులకు అండగా ఉంటాం: కలెక్టర్  హైమావతి

హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్  ఇండస్ట్రియల్  పార్క్  ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులంతా సహకరించాలని సిద్ధిపేట కలెక్టర్  కె. హైమావతి తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్​లో అక్కన్నపేట మండలం చౌటపల్లి, జనగామ, తోటపల్లి గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న భూసేకరణ ప్రక్రియపై రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్కన్నపేట మండలంలో 124 ఎకరాల్లో ఇండస్ట్రియల్  పార్క్  ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడం వల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతం ఆర్థికంగా డెవలప్​ అవుతుందని చెప్పారు. భూమిని త్యాగం చేస్తున్న రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆమోదయోగ్యమైన నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. పరిహారం చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగకుండా చూస్తామని, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూ సేకరణకు సహకరించాలని కోరారు.