హైదరాబాద్ లో అడ్వకేట్ మొహిజుద్దీన్ మర్డర్.. పోలీసుల అదుపులో నలుగురు?

 హైదరాబాద్ లో అడ్వకేట్ మొహిజుద్దీన్ మర్డర్.. పోలీసుల అదుపులో నలుగురు?
  • కల్వకుర్తి, గోవాలలో నిందితుల అరెస్ట్?
  •     మే 25న  వివరాలు వెల్లడించే అవకాశం

మెహిదీపట్నం/అబిడ్స్, వెలుగు: సిటీలో కలకలం రేపిన అడ్వకేట్ ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో నాంపల్లి పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఎలాంటి సమాచారం బయటకు రాకుండా పూర్తి గోప్యత పాటిస్తున్నారు. అయితే, కవాడిగూడకు చెందిన వినయ్ అనే వ్యక్తిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తూ పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

హత్య జరిగిన సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. నిందితుల వేట కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే నిందితులను కల్వకుర్తి, గోవాలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుల విచారణ ముగిసిన అనంతరం.. ఈ హత్యకు గల పూర్తి వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించే అవకాశం ఉంది.

ఆలం ఖాన్, ముజాహిద్ ను విచారించిన ఏసీపీ

మరోవైపు మృతుడి కొడుకు ఫర్హాన్ ఆరోపణలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. వివాదాస్పద వక్ఫ్ ఆస్తులను మహబూబ్ ఆలం ఖాన్, అతని కొడుకు ముజాహిద్ ఆలం ఖాన్ అక్రమంగా కబ్జా చేశారని, ఆ కేసును తన తండ్రి వాదిస్తున్న నేపథ్యంలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. 

రాజకీయ పలుకుబడితో వారు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫర్హాన్ ఫిర్యాదుతో అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్.. మహబూబ్ ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్​ను పిలిపించి వాంగ్మూలాలను నమోదు చేశారు. 


నిందితులకు వీఐపీ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నరు: ఎమ్మెల్యే ఫైర్


బాధిత కుటుంబానికి మద్దతుగా నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఏసీపీ కార్యాలయానికి చేరుకుని పోలీసుల దర్యాప్తు తీరుపై మండిపడ్డారు. నిందితులకు పోలీసులు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని, మొబైల్ ఫోన్లు కూడా వాడుకునే అవకాశం కల్పించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తానే వారిని తీసుకువచ్చి సరెండర్ చేయించానని చెబుతున్నప్పటికీ, పోలీసులు ఎందుకు అధికారికంగా అరెస్ట్ చూపించడం లేదని ప్రశ్నించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.