హైదరాబాద్‌‌ లో అదరగొడుతున్న రియల్‌‌ ఎస్టేట్‌‌

హైదరాబాద్‌‌ లో అదరగొడుతున్న రియల్‌‌ ఎస్టేట్‌‌
  • 2021లో 142 శాతం పెరుగుదల
  • కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇండ్లల్లో 179 శాతం గ్రోత్‌
  • సిటీలో చదరపు అడుగు సగటు రేటు రూ.4,720
  • వెల్లడించిన నైట్‌ ఫ్రాంక్ రిపోర్ట్‌

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా ఇబ్బందులు ఉన్నప్పటికీ 2021 లో హైదరాబాద్‌‌ రియల్‌‌ ఎస్టేట్‌‌ మార్కెట్ అదరగొట్టింది. సేల్స్‌‌ పరంగాను, కొత్తగా లాంచ్ చేసిన యూనిట్ల పరంగాను..దేశంలోని ఇతర సిటీలతో పోలిస్తే ఎక్కువ గ్రోత్‌‌ సాధించింది. ఇంకా 2013 తర్వాత నుంచి హైదరాబాద్‌‌ మార్కెట్‌‌లో రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గక పోవడం విశేషం.  కిందటేడాది సిటీలో 24,318 హౌసింగ్ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది  ఏడాది ప్రాతిపదికన చూస్తే 142 % ఎక్కువని  ప్రాపర్టీ కన్సల్టన్సీ కంపెనీ నైట్‌‌ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. 2011 తర్వాత చూస్తే సిటీలో ఏడాదిలో ఇంతగా హౌసింగ్ సేల్స్ జరగలేదని పేర్కొంది. అంతేకాకుండా కొత్తగా మార్కెట్‌‌లో అందుబాటులోకి వచ్చిన హౌసింగ్ యూనిట్ల సంఖ్య కూడా హైదరాబాద్‌‌లో పెరిగింది. 2021 లో మొత్తం 35,736 హౌసింగ్ యూనిట్లు కొత్తగా లాంచ్ అయ్యాయి. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 179 % ఎక్కువ. సిటీలో కిందటేడాది ఒక చదరపు అడుగు ధర యావరేజ్‌‌గా రూ. 4,720 (చదరపు మీటర్‌‌‌‌ ధర రూ. 50,806)  పలికిందని నైట్‌‌ ఫ్రాంక్ రిపోర్ట్‌‌ వెల్లడించింది. ఆఫీస్‌‌ స్పేస్ అమ్మకాల్లోనూ   హైదరాబాద్‌‌ మార్కెట్ పర్వాలేదనిపించింది. కిందటేడాది మొత్తం 60 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌‌ కోసం ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇందులో రెంట్లు, లీజ్‌‌లు కూడా కలిసున్నాయి.  కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆఫీస్‌‌ స్పేస్ 46 లక్షల చదరపు అడుగులుగా ఉంది. 

చివరి 6 నెలల్లో అదరహో...
కిందటేడాది చివరి ఆరు నెలలు (జులై–డిసెంబర్‌‌‌‌) హైదరాబాద్ రియల్‌‌ ఎస్టేట్ మార్కెట్‌‌కు కలిసొచ్చాయని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. ఈ టైమ్‌‌లో సిటీలో మొత్తం 12,344 రెసిడెన్షియల్ యూనిట్లు అమ్ముడయ్యాయని వివరించింది. అంతకు ముందు ఏడాది చివరి ఆరు నెలలతో పోలిస్తే ఇది 135 % పెరుగుదల. మొత్తం ఇండ్ల అమ్మకాల్లో  రూ. 50 లక్షల నుంచి రూ. కోటి మధ్య రేటు ఉన్న హౌసింగ్ యూనిట్ల సేల్స్‌‌ ఎక్కువగా జరిగాయి.  కిందటేడాది చివరి ఆరు నెలల్లో జరిగిన ఇండ్ల అమ్మకాల్లో ఈ మిడ్ సెగ్మెంట్‌‌ వాటా 48 శాతంగా ఉందని నైట్‌‌ ఫ్రాంక్ వివరించింది. 2020 తో పోలిస్తే 2021 చివరి ఆరు నెలల్లో సిటీలో రియల్‌‌ ఎస్టేట్‌‌ రేట్లు 5 శాతం మేర పెరిగాయని వెల్లడించింది. సిటీలో జరిగిన మొత్తం అమ్మకాల్లో వెస్ట్ హైదరాబాద్‌‌ వాటా 60 శాతంగా ఉందని పేర్కొంది. ఆఫీస్ మార్కెట్‌‌ను చూస్తే, కిందటేడాది అక్టోబర్‌‌‌‌–డిసెంబర్‌‌‌‌ పీరియడ్‌‌లో 23 లక్షల చదరపు అడుగుల కోసం ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఈ పీరియడ్‌‌లో ఆఫీస్‌‌ స్పేస్‌‌ రెంట్లు స్వలంగా (2020 తో పోలిస్తే 0.50 శాతం) పెరిగాయి. మొత్తం ఆఫీస్‌‌ స్పేస్ ట్రాన్సాక్షన్లలో 52 శాతం ట్రాన్సాక్షన్లు హైటెక్ సిటీలోని స్పేస్ కోసం జరిగాయి. దీంతో ఈ ఏరియా ఆఫీస్ స్పేస్‌‌కు వెన్నెముకగా కొనసాగుతోందని నైట్ ఫ్రాంక్ అభిప్రాయపడింది. 

సిటీ రెసిడెన్షియల్ మార్కెట్‌‌పై మరికొన్ని అంశాలు..
1) 2021 చివరి 6 నెలల్లో కొత్తగా 19,024 హౌసింగ్ యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 126 శాతం ఎక్కువ. ఇందులో 64 శాతం హౌసింగ్ యూనిట్లు వెస్ట్ హైదరాబాద్‌‌లోనే లాంచ్ అయ్యాయి. 
2) కోకపేట్‌‌, పీరంచెరు, గోపన్నపల్లి, నలగండ్ల వంటి ఏరియాల్లో డెవలప్‌‌మెంట్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతోంది. 
3) అంతేకాకుండా కిందటేడాది చివరి ఆరు నెలల్లో జరిగిన ఇండ్ల సేల్స్‌‌లో 60 శాతం వెస్ట్‌‌ హైదరాబాద్‌‌లోనే జరిగాయి. హైటెక్‌‌ సిటీ, గచ్చిబౌలి, నానక్రమ్‌‌గూడ వంటి ఆఫీస్‌‌ హబ్స్‌‌కు దగ్గర్లో ఇల్లు తీసుకునేందుకు బయ్యర్లు ఎక్కువ ఆసక్తి  చూపించారు. 
4) 2021 చివరి ఆరు నెలల్లోని ఇండ్ల అమ్మకాల్లో రూ. 50 లక్షల నుంచి రూ. కోటి మధ్య రేట్లు ఉన్న  యూనిట్లు సేల్స్ ఎక్కువగా జరిగాయి. రూ. కోటికి పైన రేట్లు ఉన్న ఇండ్ల అమ్మకాలు కూడా పుంజుకున్నాయి. 2018 మొదటి ఆరు నెలల్లో సిటీలో జరిగే ఇండ్ల అమ్మకాల్లో ఈ సెగ్మెంట్ వాటా 19 శాతం ఉండగా, 2021 చివరి ఆరు నెలల్లో ఈ సెగ్మెంట్ వాటా 30 శాతానికి ఎగిసింది.  

ఆఫీస్ మార్కెట్‌‌పై మరిన్ని అంశాలు..
1) 2021 చివరి ఆరు నెలల్లో 44 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌‌ స్పేస్‌‌ కోసం ట్రాన్సాక్షన్లు జరిగాయి.  కిందటేడాది చదరపు అడుగు ఆఫీస్‌‌ స్పేస్‌‌కు రెంటు సగటున రూ. 661 పలికింది. 
2) ఈ సారి ఐటీ సెక్టార్ కంటే మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ కోసం ఎక్కువ ఆఫీస్‌‌ స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీల్లో ఐటీ సెక్టార్ వాటా 18 శాతం ఉండగా, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ వాటా 35 శాతంగా ఉంది. 

కిందటేడాది దేశంలోని ఎనిమిది సిటీలలో 2,32,903 హౌసింగ్ యూనిట్లు సేల్ అయ్యాయని  నైట్ ఫ్రాంక్ ప్రకటించింది. 2,32,382 కొత్త ఇండ్లు లాంచ్ అయ్యాయని వివరించింది. నైట్ ఫ్రాంక్ ఇండియా రియల్‌ ఎస్టేట్‌–2021 పేరుతో తన 16  వ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. కిందటేడాది చివరి ఆరు నెలలు చూస్తే, ముంబై (34,382), ఎన్‌సీఆర్‌‌ (23,599), బెంగళూరు (23,218) లలో ఎక్కువ ఇండ్లు అమ్ముడయ్యాయి. పర్సంటేజ్‌ పరంగా చూస్తే, హైదరాబాద్‌ (135%), బెంగళూరు (104%) సిటీలలో ఇండ్ల అమ్మకాల్లో ఎక్కువ గ్రోత్‌ కనిపించింది. మొత్తం ఏడాది చూస్తే, ముంబై (62,989), బెంగళూరు (38,030), పుణే (37,218) సిటీలలో ఎక్కువ సేల్స్ జరిగాయి.  

దిగడానికి రెడీగా ఉన్న ఇండ్లకు (రెడీ టూ మూవ్‌‌) ఎక్కువ డిమాండ్ కనిపించింది. దీంతో  సిటీలోని హౌసింగ్ యూనిట్ల నిల్వలు తగ్గాయి. మంచి పేరున్న డెవలపర్ల దగ్గర కన్‌‌స్ట్రక్షన్‌‌లో ఉన్న యూనిట్లను కొనడానికి కూడా బయ్యర్లు ఆసక్తి చూపించారు. ఎఫ్‌‌ఎస్‌‌ఐ రిస్ట్రిక్షన్ల వలన కొంత ఆందోళన ఉంది. మీడియం టెర్మ్‌‌లో రెసిడెన్షియల్ మార్కెట్‌‌లో బయ్యింగ్ సెంటిమెంట్ కొనసాగుతుంది.
- శామ్సన్‌‌ ఆర్థర్‌‌‌‌, నైట్‌‌ ఫ్రాంక్ ఇండియా, హైదరాబాద్ బ్రాంచ్‌‌  డైరెక్టర్‌‌‌‌