హైదరాబాద్‌‌‌‌-విజయవాడ హైవేపై ట్రాఫికర్‌‌‌‌ ... సెలవులు ముగియడంతో తిరుగు పయనమైన జనం

హైదరాబాద్‌‌‌‌-విజయవాడ హైవేపై ట్రాఫికర్‌‌‌‌ ... సెలవులు ముగియడంతో  తిరుగు పయనమైన జనం
  • హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జాం
  • చిట్యాల, చౌటుప్పల్‌, పంతంగి టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
  • ఒకే రోజు 80 వేల వాహనాల రాక
  • వరంగల్‌ హైవేపైనా సేమ్‌ సీన్‌, గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఇబ్బందులు

యాదాద్రి/చిట్యాల/చౌటుప్పల్‌‌‌‌, వెలుగు : దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు.. సెలవులు ముగియడంతో హైదరాబాద్‌‌‌‌కు తిరుగు పయనమయ్యారు. దీంతో ఆదివారం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు హైదరాబాద్‌‌‌‌ – విజయవాడ హైవేతో పాటు వరంగల్‌‌‌‌ హైవేపై ట్రాఫిక్‌‌‌‌ రద్దీ నెలకొంది. 

విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌‌‌‌కు వచ్చే రూట్‌‌‌‌లో నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్‌‌‌‌ప్లాజాతో పాటు చౌటుప్పల్, దండు మల్కాపురం ప్రాంతాల వద్ద వెహికల్స్‌‌‌‌ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి వాహనాల్లో కూర్చొని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

సోమవారం ఉదయం ఆఫీస్‌‌‌‌లకు వెళ్లే ఉద్యోగులకు ఆలస్యం అవుతుండడంతో జాతీయ రహదారిపై రాంగ్‌‌‌‌రూట్‌‌‌‌లో ప్రయాణించారు. వేల సంఖ్యలో వాహనాలు రావడంతో.. ట్రాఫిక్‌‌‌‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఒక్క రోజే సుమారు 80 వేల వాహనాలు హైదరాబాద్‌‌‌‌ వైపు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌‌‌‌ - విజయవాడ హైవేపై అక్కడక్కడా పనులు జరుగుతుండడం ట్రాఫిక్‌‌‌‌ జామ్‌‌‌‌ కు మరింత కారణమైంది.

కిక్కిరిసిన పంతంగి, గూడూరు టోల్‌‌‌‌ప్లాజాలు

విజయవాడ, సూర్యాపేట వైపు నుంచి వచ్చిన వాహనాలతో యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌‌‌‌ప్లాజా కిక్కిరిసిపోయింది. టోల్‌‌‌‌ప్లాజా నుంచి గుండ్రాంపల్లి వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను త్వరగా పంపించేందుకు టోల్‌‌‌‌ ప్లాజా వద్ద మొత్తం 16 గేట్లు ఉండగా.. 12 గేట్ల నుంచి హైదరాబాద్‌‌‌‌ వైపు వచ్చే వాహనాలను పంపించి, మిగిలిన నాలుగు గేట్లను విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం కేటాయించారు. 

ట్రాఫిక్‌‌‌‌లో అంబులెన్స్‌‌‌‌లు సైతం చిక్కుకుపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైవేపై భారీగా ట్రాఫిక్‌‌‌‌ జాం కావడంతో.. పలువురు వాహనదారులు సర్వీస్‌‌‌‌ రోడ్డు నుంచి ప్రయాణించారు. అక్కడా ట్రాఫిక్‌‌‌‌ ఇబ్బందులు తప్పలేదు. అలాగే హైదరాబాద్‌‌‌‌ – వరంగల్‌‌‌‌ హైవేపై కూడా వాహనాల రద్దీ నెలకొంది. 

గూడూరు టోల్‌‌‌‌ప్లాజా వద్దకు భారీ సంఖ్యలో వాహనాలు రావడంతో... హైదరాబాద్‌‌‌‌ వైపు 8 గేట్లు ఓపెన్‌‌‌‌ చేసి వాహనాలను ఎప్పటికప్పుడు పంపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ట్రాఫిక్‌‌‌‌ జామ్‌‌‌‌ ఇబ్బందులు తప్పలేదు. సోమవారం రాత్రి వరకు ట్రాఫిక్‌‌‌‌ సమస్య కొంత మేర తగ్గింది.