వైర్లెస్ సిటీగా హైదరాబాద్! కేబుల్ వైర్ల కోసం అండర్ గ్రౌండ్ డక్ట్

వైర్లెస్ సిటీగా  హైదరాబాద్! కేబుల్ వైర్ల కోసం అండర్ గ్రౌండ్ డక్ట్
  • ఇప్పటికే గ్రేటర్​లో భూగర్భ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు పనులు 
  • స్తంభాలకు వేలాడే కేబుళ్ల తొలగింపు పనులు స్పీడప్​ 
  • ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా సర్కారు చర్యలు  

హైదరాబాద్, వెలుగు: 
గాలి దుమారాలు, వర్షాల వల్ల తెగిపడే కరెంటు తీగలతో పవర్ కట్ లు, వేలాడే కేబుల్ వైర్లతో నిత్యం జరిగే ప్రమాదాల వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్‌‌‌‌ను ‘వైర్‌‌‌‌లెస్ సిటీ’గా మార్చే ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అండర్‌‌‌‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, కేబుల్ వైర్ల నిర్వహణకు భూగర్భ డక్ట్‌‌‌‌ల ఏర్పాటుతో ఓవర్‌‌‌‌హెడ్ వైర్లకు త్వరలో చరమగీతం పాడనున్నారు. ప్రమాదకరంగా మారుతున్న కేబుల్ వైర్లు, కరెంట్ తీగల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా, ముంబై మోడల్‌‌‌‌ను అడాప్ట్ చేసుకునేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. 

గ్రేటర్‌‌‌‌లో అండర్‌‌‌‌ గ్రౌండ్ విద్యుత్.. 

విశ్వనగరంగా హైదరాబాద్‌‌‌‌ను తీర్చిదిద్దేందుకు వీధుల్లో వేలాడుతున్న ఓవర్‌‌‌‌హెడ్ విద్యుత్ లైన్లను తొలగించి, భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరుగుతోంది. ఓవర్ హెడ్ కేబుల్స్ లేకుండా చేసేందుకు గ్రేటర్ పరిధిలో ఒక్కో సెక్షన్‌‌‌‌కు రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని నిర్ణయించారు.

 మొత్తంగా రూ.22 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రో జోన్‌‌‌‌లోని హైదరాబాద్ సెంట్రల్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిల్స్‌‌‌‌లో 33 కేవీ, 11 కేవీ లైన్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. మేడ్చల్, రంగారెడ్డి, సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌‌‌‌నగర్ జోన్‌‌‌‌లలో కూడా ఓవర్‌‌‌‌హెడ్ లైన్లు తొలగించి భూగర్భ కేబుల్స్ వేయనున్నారు. ఫ్యూచర్ సిటీతో పాటు కోర్ సిటీలో అంతా అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఉండేలా చర్యలు చేపడుతున్నారు.  

వర్షం పడినా కరెంట్ పోకుండా.. 

భారీ వర్షాలు, గాలి దుమారాలు వచ్చినప్పుడు విద్యుత్ సరఫరాకు అంతరాయాలు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొనే ఇబ్బందులపై సమగ్ర నివేదిక తయారు చేసిన అధికారులు, భూగర్భ కేబుల్స్ తో విపత్కర పరిస్థితుల్లోనూ నిరంతర సరఫరా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ‘వర్షం పడినా కరెంట్ మాత్రం పోకూడదు’ అనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌‌‌‌ను చేపడుతున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ట్రాన్స్‌‌‌‌కో సీఎండీ నేతృత్వంలో ఇంజినీర్ల బృందం బెంగళూరులో భూగర్భ కేబుల్ పనులను పరిశీలించి.. ఖర్చులు, అంతరాయాలు, పునరుద్ధరణ పద్ధతులపై వివరాలు సేకరించారు. ఆ తర్వాత సెక్షన్‌‌‌‌ల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. 

పరిష్కారంగా ముంబై మోడల్..

ఓవర్‌‌‌‌హెడ్ కేబుల్ వైర్ల సమస్యకు ముంబై మోడల్ పరిష్కారంగా మారనుంది. బృహన్​ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) భూగర్భ డక్ట్‌‌‌‌లు ఏర్పాటు చేసి, కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఫైబర్ కేబుల్స్‌‌‌‌ను అండర్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో వేయడానికి అనుమతించింది. పీపీపీ ద్వారా ఆపరేటర్లకు సబ్సిడీ రేట్లతో యాక్సెస్ ఇచ్చి, అనధికార వైర్లకు జరిమానాలు విధిస్తూ, పోల్స్, చెట్లపై వేలాడే వైర్లు తొలగిస్తోంది. కేబుల్ టెలివిజన్ నెట్‌‌‌‌వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్, 1995 ప్రకారం ఆపరేటర్లు రిజిస్టర్ చేసుకుని నెట్‌‌‌‌వర్క్ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 

మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఎమ్‌‌‌‌ఎస్‌‌‌‌ఈడీసీఎల్) భారీగా భూగర్భ కేబులింగ్ చేసి, కేబుల్ సర్వీస్‌‌‌‌లకు ఉపయోగపడేలా చేసింది. జీహెచ్‌‌‌‌ఎంసీ కూడా ముంబై మాదిరిగా భూగర్భ డక్ట్‌‌‌‌లు ఏర్పాటు చేస్తూ, పీపీపీ విధానంలో ఆపరేటర్లకు డక్ట్‌‌‌‌లలో కేబుల్స్ వేసుకునే అవకాశం కల్పిస్తోంది. వేలాడే కేబుల్ వైర్లు, తీగలు కనిపించని నగరంగా హైదరాబాద్‌‌‌‌ను తీర్చిదిద్దాలని, ప్రమాదాలు నియంత్రించడంతో పాటు విపత్కర పరిస్థితుల్లోనూ నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎస్పీడీసీఎల్ అధికారులు చెప్తున్నారు. 

ప్రమాదకరంగా కేబుల్​ వైర్లు.. 

గ్రేటర్ లో ఓవర్‌‌‌‌హెడ్ కేబుల్ వైర్ల సమస్య తీవ్రంగా ఉంది. హైదరాబాద్‌‌‌‌లో 20 లక్షల కరెంటు స్తంభాల్లో కేవలం 1.73 లక్షల స్తంభాలకే కేబుల్ కంపెనీలు అనుమతి తీసుకున్నాయి. అనధికారంగా ఇంటర్నెట్, టీవీ కేబుల్స్ (ఆప్టికల్ ఫైబర్, కో-యాక్సియల్) వేసి, స్తంభాలపై రంగు గుర్తింపు, 18 అడుగుల ఎత్తు నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రామంతాపూర్‌‌‌‌లో ఆరుగురు మృతి చేసిన ఘటనలోనూ ఇలాంటి తెగిన కేబుల్ విద్యుత్ లైన్‌‌‌‌పై పడి షార్ట్ సర్క్యూట్ అయినట్లు డిస్కం నివేదిక పేర్కొంది. 

వేలాడే కేబుల్ వైర్లు వెహికల్స్ తగులుతూ ప్రమాదకరంగా మారాయి. కరెంటు పోల్స్ పై విద్యుత్ సిబ్బంది ఎక్కే క్రమంలో కేబుళ్లు తట్టుకుని  పడిపోతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. సదరన్ డిస్కం సీఎండీ 2024 జులై నుంచి 32 కంపెనీలతో ఆరు సార్లు మీటింగ్‌‌‌‌లు నిర్వహించి కరెంట్ పోల్స్ పై కేబుల్ వైర్లును తొలగించాలని కోరినా స్పందన రాలేదు. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా కేబుళ్ల తొలగింపు పనులు వేగవంతం చేశారు.