
- పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు.. కార్యక్రమాల షెడ్యూల్ విడుదల
- 21న వరంగల్ వేయి స్తంభాల గుడిలో వేడుకలు షురూ
- 30న హైదరాబాద్ ట్యాంక్బండ్పై ముగింపు
- 28న గిన్నిస్ రికార్డ్ స్థాయిలో ఎల్బీ స్టేడియంలో 10 వేల మందితో వేడుకలు
- బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై మంత్రి జూపల్లి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. ఈ నెల 21న వరంగల్ జిల్లా వేయి స్తంభాల గుడిలో వేడుకలను ప్రారంభించి, 30న హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ముగించనుంది. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై మంగళవారం బేగంపేట టూరిజం ప్లాజాలో పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డెరెక్టర్ లక్ష్మితో కలిసి సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామాలతోపాటు హైదరాబాద్‌లోనూ సంబురాలు ఘనంగా నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక, చారిత్రక ప్రాంతాలను ముస్తాబు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు నిర్వహించే సంబురాలకు సంబంధించిన షెడ్యూల్‌ను మంత్రి విడుదల చేశారు. సమావేశంలో సీఎం స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవానీరెడ్డి పాల్గొన్నారు.
సంబురాల షెడ్యూల్ ఇలా..
వేయిస్తంభాల గుడిలో ఈ నెల 21న సాయంత్రం బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. అదేరోజు ఉదయం హైదరాబాద్ శివారులో మొక్కలు నాటుతారు. 22న హైదరాబాద్ శిల్పారామం, మహబూబ్‌నగర్ పిల్లలమర్రి వద్ద, 23న నాగార్జునసాగర్ బుద్ధవనం, 24న జయశంకర్ జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ఆవరణలో, కరీంనగర్ సిటీ సెంటర్లో, 25న భద్రాచలం ఆలయం వద్ద, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. 25 నుంచి 29 వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ ఉంటుంది. 26న నిజామాబాద్ అలీసాగర్ రిజర్వాయర్, ఆదిలాబాద్, మెదక్‌జిల్లాల్లో సంబురాలు జరుగుతాయి. అదేరోజు హైదరాబాద్‌నెక్లెస్ రోడ్ లో ఉదయం సైకిల్ ర్యాలీ ఉంటుంది. 27న ఉదయం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద మహిళల బైక్ ర్యాలీ.. సాయంత్రం ఐటీ కారిడార్లో బతుకమ్మ కార్నివాల్ ఉంటాయి. 28న ఎల్‌బీ స్టేడియంలో10 వేలకుపైగా మహిళలతో గిన్నీస్ రికార్డ్ సాధించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. 50 అడుగుల ఎత్తున బతుకమ్మను అలంకరించనున్నారు. 29న పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ పోటీలు, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో సరస్ ఫెయిర్ నిర్వహించనున్నారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆర్ డబ్ల్యూఏ (రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్), హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్‌ప్రైజస్ అసోసియేషన్ (హైసియా) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు, పోటీలు ఉంటాయి. 30న ట్యాంక్‌బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కారు ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ఫ్లోట్స్, ఇకెబానా, జపనీయుల ప్రదర్శన నిర్వహిస్తారు. రాత్రికి సెక్రటేరియట్‌పై 3డీ మ్యాప్ లేజర్ షోతో సంబురాలు ముగుస్తాయి.
వేడుకలను సక్సెస్ చేయాలి: జూపల్లి
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ వేడుకలను సక్సెస్ చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సంస్కృతి, ప్రకృతి, పర్యాటకంతో మమేకమయ్యేలా వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఎంపిక చేసిన జంక్షన్లతోపాటు టూరిజం హోటళ్లు, రైల్వే, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, యూనివర్సిటీల్లో బతుకమ్మ ప్రతిమలు నెలకొల్పాలన్నారు. విద్యార్థులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా కాలేజీలు, యూనివర్సిటీల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సంబురాల్లో భాగంగా సాంస్కృతిక కళా సారథుల సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లుకు సూచించారు.