పాత బెడ్లు, బెడ్ షీట్లు, వుడ్ వెస్టేజ్ ఎక్కడేసుడు?..తీస్కపోనంటున్న చెత్త ఆటోలు  

పాత బెడ్లు, బెడ్ షీట్లు, వుడ్ వెస్టేజ్ ఎక్కడేసుడు?..తీస్కపోనంటున్న చెత్త ఆటోలు  
  • ఎక్కువ పైసలిస్తామన్నా రాని ప్రైవేట్ ఆటోలు  
  • రోడ్లపై వేస్తే లక్ష జరిమానా  
  • నాలాలు, రోడ్ల పక్కన పారేస్తున్న జనం 
  • తోడిన కొద్దీ అవే వస్తున్నయ్​
  • ఈ వేస్ట్ తరహాలో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్న జనం

హైదరాబాద్ సిటీ, వెలుగు : పాత బెడ్లు, బెడ్ షీట్లు, మెత్తలు, సోఫాలు, వుడ్ వెస్టేజ్ వంటి బల్క్ గార్బేజ్ ఎక్కడ వేయాలనే విషయంలో నగరవాసులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోలు వీటిని తీసుకోవడానికి నిరాకరిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పినా చెత్త ఆటో కార్మికులు తమ వాహనాల్లో పట్టవని చెప్తున్నారు. మరోవైపు, ఇలాంటి వ్యర్థాలను రోడ్లపై, ఖాళీ స్థలాల్లో లేదా నాలాల్లో పడేస్తే భారీ జరిమానాలు విధిస్తామని మూడు కమిషనరేట్ల అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఏకంగా రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని చెప్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయం లేక కొందరు రాత్రి వేళల్లో  రోడ్ల పక్కన, నాలాల్లో లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో పడేస్తున్నారు. రోడ్ల పక్కన వేసినవి జీహెచ్ఎంసీ గార్భేజ్ కలెక్షన్ వాహనాల్లో డంపింగ్ యార్డు లకు చేరుతుండగా, నాలాల్లో వేసిన వాటితోనే సమస్యలు తలెత్తుతున్నాయి. ఇవి వరదకు అడ్డం పడి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్నాయి. దీంతో భారీ వర్షం కురిసినప్పుడు నాలా చుట్టుపక్కల ఉన్న ఇండ్లలోకి వరద వస్తోంది. ఇటీవల నాలాలు క్లీన్​చేస్తుండగా చాలాచోట్ల ఇటువంటి వ్యర్థాలే బయటపడ్డాయి. 

ఈ వేస్ట్ తరహాలో కలెక్ట్ చేయాలి 

మూడు కార్పొరేషన్లలో పరిధిలో ఈ వేస్ట్ కలెక్ట్ తరహాలో ఇండ్లలో పేరుకుపోయిన పాత వస్తువులను కలెక్ట్  చేసేందుకు స్పెషల్ డ్రైవ్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ వేస్ట్ కోసం సెంటర్లు ఏర్పాటు చేసిన బల్దియా ఈ వేస్ట్ ఇచ్చిన వారికి  పాయింట్లతో పాటు కొత్త వస్తువులను కొనుగోలులో డిస్కౌంట్​సౌకర్యం కల్పిస్తోంది. ఇదే తరహాలో ఇండ్లలో పేరుకుపోతున్న పాత వస్తువుల కోసం డ్రైవ్ నిర్వహించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ప్లాన్​చేస్తున్నాం : ఆఫీసర్లు

సైబరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​ పరిధిలోని పలు సర్కిల్స్​లో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసి పాత వస్తువులను కలెక్ట్ చేయాలని భావిస్తున్నామని అధికారులు చెప్పారు. బెడ్స్, బెడ్​షీట్స్, మెత్తలు, వుడ్​వేస్టేజీ వంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపితే అక్రమంగా వ్యర్థాల పారవేతకు అడ్డుకట్ట పడుతుందన్నారు.  

కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేయాలి

ఇండ్లలో పేరుకుపోతున్న బల్క్ గార్బేజ్ సేకరణ కోసం ప్రతి సర్కిల్ లేదా డివిజన్ స్థాయిలో ప్రత్యేక సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. వారానికి ఒకటి లేదా రెండు రోజులు ప్రత్యేక బల్క్ వ్యర్థాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఫోన్ కాల్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుకింగ్​చేసుకునే ఫెసిలిటీ కల్పించాలని, ఇంటి వద్దకే ప్రత్యేక వాహనాలను పంపించి ఈ వ్యర్థాలను సేకరించే విధంగా చేయాలని కోరుతున్నారు. అయితే మూడేండ్ల కింద ఇండ్లలో పేరుకుపోయిన ఇటువంటి వేస్టేజ్​కలెక్ట్ చేసేందుకు జీహెచ్ఎంసీ పలు ట్రక్కలు ఏర్పాటు చేసి ఓ డ్రైవ్ నిర్వహించినా..ఎప్పుడొస్తాయో తెలియక జనం నుంచి స్పందన రాలేదు.