
- మిగతా 358 భవనాలకు నోటీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో 685 పాత భవనాలున్నాయని, ఇందులో 327 బిల్డింగులను ఖాళీ చేయించి రిపేర్లు చేసుకోవాలని ఓనర్లను టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదేశించారు. పూర్తిగా బాగాలేని మిగతా 358 బిల్డింగ్స్ ఖాళీ చేయించాలని ఓనర్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా పాత బిల్డింగులు, సెల్లార్ తవ్వకాలపై తీసుకున్న చర్యలపై టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతో కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఆన్ లైన్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆఫీసర్లు మాట్లాడుతూ.. 154 సెల్లార్ తవ్వకాలు గుర్తించగా, 61 సైట్లలో రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 93 సైట్లలో జాగ్రత్త చర్యలు, రిటైనింగ్ వాల్ నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయన్నారు. 52 అనధికార సెల్లార్లకు నోటీసులు జారీ చేసి, వాటిని సీ అండ్ డీ వ్యర్థాలతో మూసివేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితిలో తప్ప, ఎవరూ సెలవు తీసుకోకూడదన్నారు. ఉన్నతాధికారి అనుమతి లేకుండా హెడ్డాఫీసు విడిచి వెళ్లకూడదని ఆదేశించారు.
మలక్ పేటలో బల్దియా కమిషనర్ పర్యటన
వరద ముంపునకు గురవుతున్న మలక్ పేటలో కమిషనర్ కర్ణన్ మంగళవారం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలతో కలిసి పర్యటించారు. మలక్ పేట రైల్వే బ్రిడ్జి, అజంపురా, నల్గొండ క్రాస్ రోడ్డులో వరద నిలిచే ప్రాంతాలతో పాటు అక్కడ పంపింగ్ మెషీన్లను పరిశీలించారు. ప్రత్యామ్నాయ డ్రైనేజ్ మార్గాలను పరిశీలించి ప్రతిపాదనలు ఇవ్వాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తర్వాత డబీర్ పురాలోని నాలాలను పరిశీలించారు.