ఈజీ మనీ కోసం డ్రగ్స్ విక్రయం.. ఇద్దరు రాజస్థాన్ వాసులు అరెస్ట్

ఈజీ మనీ కోసం డ్రగ్స్ విక్రయం.. ఇద్దరు రాజస్థాన్ వాసులు అరెస్ట్


 

  • పరారీలో మరో ఇద్దరు 
  • 23 గ్రాముల ఎండీఎంఏ స్వాథీనం

మల్కాజ్ గిరి, వెలుగు: ఈజీ మనీ కోసం డ్రగ్స్​విక్రయిస్తున్న రాజస్థాన్​కు చెందిన ఇద్దరిని ఎస్ఓటీ మల్కాజిగిరి జోన్, మల్కాజిగిరి పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌‌లో అరెస్ట్ చేసినట్లు డీసీపీ  శ్రీధర్  తెలిపారు. మంగళవారం నార్త్​జోన్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌‌లోని జలోర్ జిల్లా హరియాలికి చెందిన మహావీర్ సింగ్(28) ర్యాపిడో డ్రైవర్‌‌గా చేస్తూ సికింద్రాబాద్ రాణిగంజ్‌‌లోని గాస్‌‌మండిలో ఉంటున్నాడు. ఇదే రాష్ట్రంలోని జోధ్‌‌పూర్ ఫలోడీ జిల్లా బావ్‌‌డీ కలాన్​కు చెందిన లక్ష్మణ్ సింగ్ రాజ్‌‌పురోహిత్(45) క్యాటరింగ్ పనులు చేస్తూ సికింద్రాబాద్ బోయిన్‌‌పల్లిలోని శక్తిసాయి కాలనీలో నివసిస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులు.

సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో మహావీర్ సింగ్ డ్రగ్స్ సప్లై చేస్తుండగా.. లక్ష్మణ్ సింగ్ వినియోగదారుడిగా ఉన్నాడు. మహావీర్ సింగ్ జోధ్‌‌పూర్ నుంచి ఎండీఎంఏను తెప్పించి హైదరాబాద్‌‌లో లక్ష్మణ్ సింగ్‌‌కు, ఇతరులకు విక్రయిస్తున్నాడు. ఈ నెల 21న మధ్యాహ్నం మల్కాజ్​గిరి రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న కవర్లలో చూడగా 23 గ్రాముల ఎండీఎంఏ లభ్యమైంది. విచారణలో జోధ్‌‌పూర్‌‌కు చెందిన కుల్దీప్ డ్రగ్స్ సరఫరాదారుగా, కోకాపేట్‌‌కు చెందిన కైలాష్ మరో వినియోగదారుడిగా తేలింది. వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి ఎండీఎంఏతోపాటు రెండు ఫోన్లు, రూ.5,600 స్వాధీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.