ఒకే ఒక్కసారి.. ఒకే ఒక్క మాట.. హోటల్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీని అల్లకల్లోలం చేసింది. అవును.. 2026, మే ఒకటో తేదీ ఉదయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన షాక్ తో అందరికీ కళ్లు బైర్లు కమ్మాయి.
ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ ధరల్లో మార్పు కామన్. మే ఒకటో తేదీన యథావిధిగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా 993 రూపాయలు పెంచింది. అంటే ఏడు రూపాయలు తక్కువగా వెయ్యి రూపాయలు అన్న మాట. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరతో హైదరాబాద్ సిటీలో 19 కేజీల గ్యాస్ బండ ధర ఏకంగా 3 వేల 315 రూపాయలకు చేరింది.
2026, ఏప్రిల్ 30వ తేదీన ఈ ధర 2 వేల 321 రూపాయలుగా ఉంది. రాత్రికి రాత్రి 993 రూపాయలు పెరగటంతో హోటల్స్, హాస్టల్స్, ఇతర కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఉపయోగించే వ్యాపారులు షాక్ అయ్యారు.
2026, ఏప్రిల్ ఒకటో తేదీన కమర్షియల్ గ్యాస్ ధరను 200 రూపాయలు పెంచారు. నెల రోజులు తిరగక ముందే మరో 993 రూపాయలు పెంచటంతో చిరు వ్యాపారులపై భారం తీవ్రంగా పడనుంది.
ముఖ్యంగా హోటల్స్ లో ధరలు పెంచేస్తున్నారు.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర అమాంతం పెంచిన కేంద్రం.. డొమెస్టిక్ అంటే ఇళ్లల్లో ఉపయోగించే 14 కేజీల గ్యాస్ బండల ధరలు మాత్రం పెంచలేదు. అమెరికా, ఇరాన్ యుద్ధం క్రమంలో.. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ రావటం లేదు. దీనికితోడు వస్తున్న గ్యాస్ సైతం.. అధిక ధరల్లో ఉంది. ఈ క్రమంలోనే గ్యాస్ ధరలను పెంచింది కేంద్రం.
