హైకోర్టుకు హైడ్రా కమిషనర్ క్షమాపణ

 హైకోర్టుకు హైడ్రా కమిషనర్ క్షమాపణ
  • ధిక్కరణ పిటిషన్ పై విచారణకు వ్యక్తిగతంగా హాజరు  
  • బతుకమ్మ కుంట పరిధిలో ప్రైవేట్ స్థల వివాదం కేసులో విచారణ  

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బతుకమ్మకుంట పరిధిలోని ప్రైవేటు స్థల వివాదంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం వ్యక్తిగతంగా హాజరైన హైడ్రా కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రంగనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైకోర్టుకు  క్షమాపణ చెప్పారు. బాచుపల్లిలో వరదలు రావడంతో అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చినందున కోర్టుకు హాజరుకాలేకపోయానని, అంతేగానీ కోర్టుల పట్ల అగౌరవం లేదని తెలిపారు. రంగనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్షమాపణను ఆమోదించిన హైకోర్టు తదుపరి విచారణకు హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

బతుకమ్మ కుంట స్థలంపై యథాతథస్థితిని కొనసాగించాలంటూ జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 12న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలంటూ ఎ.సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   మధుసూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఊరిళ్ల వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని, స్థల పరిరక్షణకు మాత్రమే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.  గతంలో కౌంటరుతోపాటు సమర్పించిన ఫోటోలను పరిశీలించాలన్నారు. 

చెరువు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. సీఎం వచ్చారా, లేదా.. తదితర అంశాలు తమకు అవసరంలేదని, కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరించారా? లేదా? అన్నదే చూస్తామని తెలిపింది. ప్రస్తుతం స్థలానికి సంబంధించి ఫోటోలను పరిశీలిస్తే గుర్తుపట్టలేని విధంగా ఉందని.. అలాంటప్పుడు కోర్టులో పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా ఏదైనా ఉత్తర్వులు వచ్చినా ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించింది.  అనంతరం విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.