
- మాదాపూర్ భూముల విషయంలో హైడ్రాకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: శేరిలింగంపల్లి మండలం మాదాపూర్‌లోని సర్వే నంబర్ 66, 67లో సుమారు రెండు వేల చదరపు గజాల భూమి విషయంలో జోక్యం చేసుకోరాదని హైడ్రా, జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశించింది. పార్క్ కోసం కేటాయించిన జాగా ఆక్రమణకు గురైందంటూ వచ్చిన ఫిర్యాదులో హైడ్రా జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ వై.జగల్ రెడ్డి, వై.వెంకట్ రెడ్డి ఇటీవల వేర్వురుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి మంగళవారం విచారించారు. తమ జాగాలోని ఇండ్ల విషయంలో హైడ్రా, జీహెచ్‌ఎంసీ చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకున్నాయని పిటిషనర్లు వాదించారు. పిటిషనర్ల భూమి విషయంలో హైడ్రా వ్యవహరించిన తీరు బాగోలేదని.. హైడ్రాతో పాటు ఇతర అధికారులు జోక్యం చేసుకోరాదని హైకోర్టు ఆదేశించింది.
హైడ్రా స్వాధీనం చేసుకున్న స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలంది. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని కూడా ఆదేశించింది. జనవరి 28 జారీ చేసిన నోటీసులకు ఫిబ్రవరి 3న పిటిషనర్ రిప్లై ఇచ్చారని, అర్బన్ ల్యాండ్ (సీలింగ్ అండ్ రెగ్యులేషన్) చట్టం– 1976 కింద క్రమబద్ధీకరణ కూడా జరిగిందని పిటిషనర్ లాయర్ చెప్పారు. దీనిపై హైకోర్టు.. జూబ్లీ ఎన్‌క్లేవ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భూమి పార్క్ కోసం కేటాయింపు జరిగినట్లుగా లేదని అభిప్రాయపడింది. గతంలోని కోర్టు రికార్డులు, ప్రభుత్వ పత్రాలను పరిశీలిస్తే పిటిషనర్ వాదనలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పింది. హైడ్రా చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 18 కి వాయిదా వేసింది.