- 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదు చోరీ
గోషామహల్, వెలుగు: గోషామహల్ పరిధిలోని బేగంబజార్ ఛత్రి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బంధువుల పెండ్లికి వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇంటిని సర్వం ఊడ్చేశారు. బేగంబజార్‌కు చెందిన మహేశ్ జీ ప్లస్ టూ భవనంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఆయన తల్లి, మొదటి అంతస్తులో తమ్ముడు నివాసం ఉండగా, రెండో అంతస్తులో మహేశ్ కుటుంబం ఉంటోంది. లంగర్‌హౌస్‌లో జరుగుతున్న బంధువుల పెండ్లి వేడుకల కోసం గత ఆరు రోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి వస్తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం కూడా ఇంటికి తాళం వేసి వెళ్లారు. అర్ధరాత్రి 12:30 గంటలకు తిరిగి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉండటం, లోపల బీరువాలోని 30 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి, రూ. 5 లక్షల నగదు కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గోషామహల్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్ క్లూస్ టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరించారు. బాధితుల రాకపోకలను గమనించిన పరిచయస్తులే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
