మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారీకి ఇండియన్ ఇమ్యునలాజికల్స్ ఆసక్తి

మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారీకి ఇండియన్ ఇమ్యునలాజికల్స్ ఆసక్తి

మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారు చేసేందుకు హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ కసరత్తు చేస్తోంది. మంకీపాక్స్ కట్టడి చర్యల్లో భాగంగా ఈ వైరస్ను అడ్డుకునేందుకు వ్యాక్సిన్ అభివృద్ధికి కేంద్రం టెండర్లను ఆహ్వానించింది. ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీలు ఆగస్టు 10 లోగా తమ ఆసక్తిని తెలపాలని కోరింది. వ్యాక్సిన్ తో పాటు మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ నిర్ధారణ కోసం ఇన్ విట్రో డయాగ్నోస్టిక్ కిట్ల తయారీలో అనుభవమున్న కంపెనీలు కూడా తమ ఆసక్తిని వ్యక్తీకరించాలంది.

మంకీపాక్స్ వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ ఛాలెంజ్ స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐఐఎల్ ఎండీ డాక్టర్ ఆనంద్ కుమార్ తెలిపారు. కేంద్ర విధించిన గడువు కంటే ముందే వ్యాక్సిన్ తయారీకి ఆసక్తితో ఉన్నామని దరఖాస్తు చేస్తామన్నారు. నీతి ఆయోగ్ అధికారులతో టచ్ లో ఉన్నామని..ఆర్థిక విషయాల గురించి వారితో తర్వాత చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం తాము ఇప్పటికే రెండు బయో సేఫ్టీ లెవల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ కలిగి ఉన్నామని  చెప్పారు. 

నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ ద్వారా 1982లో జంతు వ్యాక్సిన్‌లను తయారు చేసేందుకు ఐఐఎల్  ఏర్పాటు అయింది. అయితే ఇది మానవులకు సంబంధించిన వ్యాక్సిన్లను కూడా తయారు చేసింది. రాబిస్, హెపటైటిస్- B, డీపీటి, పెంటావాలెంట్ షాట్ వంటి వ్యాక్సిన్‌లను తయారు చేసింది. 2021--22లో ఐఐఎల్ 820 కోట్ల ఆదాయాన్ని సాధించింది.