గచ్చిబౌలి,మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పేరుతో 77లక్షలు టోకరా

గచ్చిబౌలి,మాదాపూర్  లో  సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పేరుతో 77లక్షలు టోకరా

మాదాపూర్, వెలుగు: ప్రముఖ ఎంఎన్​సీ కంపెనీల్లో సాఫ్ట్​వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ఓ నిరుద్యోగి వద్ద లక్షలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మాదాపూర్ చంద్రనాయక్​తండాలోని హాస్టల్‌లో ఉండే సాయి సతీశ్​కు.. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి కంపెనీల్లో జాబ్ ఇస్తానని వెంకటకృష్ణ కుమార్ పరిచయం చేసుకున్నాడు. 

ఉద్యోగం కోసం వివిధ అవసరాల పేరుతో నమ్మబలికి, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా బాధితుడి నుంచి రూ.22.47 లక్షలు కాజేశాడు. డబ్బులు తీసుకున్నప్పటికీ ఉద్యోగం ఇప్పించకపోగా, తిరిగి డబ్బులడిగితే ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన సాయి సతీశ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

  • యువతి వద్ద రూ.46.95 లక్షలు వసూలు చేసిన వ్యక్తిపై కేసు

గచ్చిబౌలి, వెలుగు: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ యువతి వద్ద రూ.46.95 లక్షలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై గచ్చిబౌలి పోలీస్​స్టేషన్‌‌లో కేసు నమోదైంది. కొండాపూర్‌‌లోని ప్రైవేట్​హాస్టల్‌‌లో ఉంటున్న యువతికి అశోక్ అనే స్నేహితుని ద్వారా తరుణ్ శర్మ పరిచయమయ్యాడు. విదేశీ ఉద్యోగ నియామక సంస్థలతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి హైటెక్​సిటీలోని తన ఆఫీస్‌‌లో పలుమార్లు డబ్బులు వసూలు చేశాడు. 

అంతేకాకుండా ఐపీఎల్, రాజస్థాన్ రాయల్స్ టీమ్‌‌లతో సంబంధాలు ఉన్నాయని చెప్పి వివిధ అవసరాల పేరుతో మరింత డబ్బు డిమాండ్ చేయడంతో బాధితురాలు అప్పు చేసి మరీ మొత్తం రూ.46.95 లక్షలు చెల్లించింది. ఉద్యోగం గురించి అడిగితే దాటవేస్తూ, బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని సాకులు చెప్పాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఠాణాలో ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.