జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని ప్రణీత్ ఆంటీలియా ప్రహారీ గోడను హైడ్రా అధికారులు సోమవారం కూల్చివేసి కొత్త దారి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమది గేటెడ్ కమ్యూనిటీ అని, మున్సిపాలిటీకి అన్ని పన్నులు చెల్లిస్తున్నామని, ఏండ్ల తరబడి ఉన్న గోడను ముందస్తు సమాచారం లేకుండా కూల్చడం సరికాదని నివాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమతో చర్చించకుండానే ఈ చర్యలు తీసుకోవడంపై మండిపడ్డారు.
పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను అక్కడి నుంచి తరలించారు. అనంతరం హైడ్రా అధికారులు కూల్చివేతలు పూర్తి చేశారు. అందరికీ ప్రయోజనకరంగా ఉండాలనే ఉద్దేశంతో, కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే ఈ గోడను తొలగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
