హైదరాబాద్ డాక్టర్ నుంచి 14 కోట్లు కొట్టేసిన కేసులో నలుగురు సైబర్ నేరగాళ్లు అరెస్ట్..

హైదరాబాద్ డాక్టర్ నుంచి 14 కోట్లు కొట్టేసిన కేసులో నలుగురు సైబర్ నేరగాళ్లు అరెస్ట్..

గత నెలలో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ నుంచి సైబర్ నేరగాళ్లు 14 కోట్లు కొట్టేసిన ఘటన గుర్తుందా..? ఈ కేసుకి సంబంధించి శనివారం ( డిసెంబర్ 20 ) నలుగురు సైబర్ నేరగాళ్ళను అరెస్ట్ చేశారు పోలీసులు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో డాక్టర్ ను బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు. ఈ కేసులో ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు సైబర్ నేరగాళ్ళను అరెస్ట్ చేశారు. డాక్టర్ ను   కంబోడియా నుంచి ట్రాప్ చేసి మోసం చేసినట్లు గుర్తించారు పోలీసులు.

 కంబోడియాలో తిష్ట వేసిన  చైనీయులే ఈ వ్యవహారం వెనకాల ఉన్నారని తెలిపారు పోలీసులు.ఇండియా నుంచి ఉద్యోగాల పేరుతో యువకుల్ని తీసుకువెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని.. మన దేశం వాళ్లతోనే సైబర్ నేరాలు చేయిస్తున్నారని తెలిపారు. కంబోడియాలో ఉన్న సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్స్ అందించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మ్యూల్ అకౌంట్ లోకి వచ్చిన డబ్బుల్ని వివిధ మార్గాల ద్వారా కాంబోడియాకి తరలించినట్లు గుర్తించామని తెలిపారు. 

ఫేస్ బుక్ లో అందమైన అమ్మాయి ఫోటోలతో డాక్టర్ని బుట్టలో వేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. అందమైన అమ్మాయి ఫోటో చూసి చాటింగ్ మొదలుపెట్టిన డాక్టర్.. లోన్లు పెట్టి, ఇల్లు అమ్మి మరీ 14 కోట్లు సమర్పించుకున్నాడు. 

తాను ఒక ఒంటరి మహిళలనని కంపెనీలో పని చేస్తానని పరిచయం చేసుకున్న లేడీ.. స్టాక్ మార్కెట్లో తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని డాక్టర్  ను నమ్మించింది. కిలాడీ లేడీ మాయమాటలు నమ్మిన డాక్టర్ ఇల్లును అమ్మి 14 కోట్లు మోసపోయాడు.