గోల్డ్ ​ఉంచుకుని సెల్​ఫోన్ ​అమ్మాడు.. సిగ్నల్స్​ పట్టించాయి

గోల్డ్ ​ఉంచుకుని సెల్​ఫోన్ ​అమ్మాడు.. సిగ్నల్స్​ పట్టించాయి
  •     సెల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల పట్టివేత
  •     నలుగురిని అరెస్ట్ చేశామన్న సీపీ అంజనీ కుమార్

హైదరాబాద్‌, వెలుగు:  కిలోన్నర గోల్డ్ ఉన్న బ్యాగ్ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. గురువారం వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్​మీడియాకు వెల్లడించారు. బషీర్‌‌బాగ్‌లోని వీఎస్‌ గోల్డ్‌ జ్యుయలరీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రదీప్‌ కుమార్(34), ఈ నెల 9 న జూబ్లీహిల్స్‌లోని  కృష్ణ జ్యుయలర్స్ పెరల్స్‌కి వెళ్లాడు. అక్కడ 143 తులాల బంగారు ఆభరణాలు తీసుకుని బంజారాహిల్స్ రోడ్‌ నంబర్‌‌ 3 మీదుగా బషీర్‌‌ బాగ్‌ వెళ్తున్నాడు. భారీ వర్షం ఉండడంతో రాత్రి 7 గంటల సమయంలో కంగారో కిడ్స్‌ స్కూల్‌ వద్ద వరద నీటిలో పడిపోయాడు. దీంతో గోల్డ్‌ బ్యాగ్‌ తో పాటు సెల్ ఫోన్ నీటిలో పడిపోయాయి. ప్రదీప్ అక్కడ గుడిసెలో ఉండే గోటి నిరంజన్ తో కలిసి  బ్యాగ్ కోసం వెతికినా కనిపించలేదు. వీఎస్ జ్యుయలరీ ఓనర్​తో కలిసి వెళ్లి పోలీసులకు కంప్లయింట్ఇచ్చారు.

వెతికినట్టు నటించి..

విచారణలో భాగంగా పోలీసులు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ను  ఇచ్చిన వివరాలతో బ్యాగ్ పోయిన ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్​లను పరిశీలించారు.  గోటి నిరంజన్ (40), గుడిసె పక్కనే బ్యాగు పడిపోవడంతో తీసుకొని గుడిసెలో పెట్టుకుని ప్రదీప్​తో కలిసి వెతికినట్టు నటించాడు. ఆ తర్వాత  గోల్డ్, సెల్ ఫోన్  తీసుకొని బ్యాగ్ ను వరద నీటిలో పడేశాడు. యల్లమ్మబండలోని తనకు తెలిసిన వెంకటయ్య ఇంట్లో గోల్డ్​ను దాచాడు. నిరంజన్​గుడిసెలోనే ఉండే పవనమ్‌ బలపీర్‌‌(32), జి. రంజిత్ కుమార్(22) ఎం. వెంకటయ్య(55) కుమార్‌‌ రాజారాంలతో కలిసి అమ్ముకోవాలని ప్లాన్ వేశారు.

సెల్ ఫోన్ అమ్మి..

ప్రదీప్​ మొబైల్​ను పోలీసులు ట్రేసింగ్ లో పెట్టారు. నిందితులు జగద్గిరిగుట్టలో ఓ మొబైల్ షాప్ లో సెల్ ఫోన్ ను అమ్మారు. ఆ షాప్ అతను స్విచ్ఛాన్ చేయటంతో ఫోన్ సిగ్నల్ జగద్గిరిగుట్టలో ఉన్నట్లు గుర్తించి వెళ్లి అడగడంతో నిరంజన్ అమ్మినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తెలిసిన వ్యక్తి ఇంట్లో దాచిన గోల్డ్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దాదాపు 18 తులాల గోల్డ్ అమ్మాడు.