మహిళల భద్రతకు కొత్త భరోసా..హైదరాబాద్ పోలీసుల ‘మార్గదర్శక్’ ప్రారంభం

మహిళల భద్రతకు కొత్త భరోసా..హైదరాబాద్ పోలీసుల ‘మార్గదర్శక్’ ప్రారంభం
  • ఇదో ప్రజా ఉద్యమంగా మారాలని సీపీ సజ్జనార్ పిలుపు

బషీర్​బాగ్, వెలుగు:  మహిళలు, చిన్నారుల భద్రతను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ పోలీసులు ‘మార్గదర్శక్’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం బంజారాహిల్స్​లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని సీపీ సజ్జనార్ అధికారికంగా ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఎదుర్కొనే వేధింపులు, పని ప్రదేశాల్లో ఇబ్బందులు, గృహ హింస వంటి సమస్యలను మహిళా బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

చాలా మంది తమ సమస్యలను బయటకు చెప్పలేక మౌనంగా ఉండిపోతున్నారని, ఇది కాలక్రమేణా తీవ్రమైన నేరాలకు దారితీసే అవకాశముందన్నారు. ఇటువంటి బాధితులకు చట్టపరమైన రక్షణ, పోలీసు వ్యవస్థపై అవగాహన కల్పిస్తూ సరైన దిశానిర్దేశం చేయడమే ‘మార్గదర్శక్’ ముఖ్య ఉద్దేశమని కమిషనర్ వివరించారు. 

అనుసంధానకర్తలుగా వాలంటీర్లు 

బాధితులు, పోలీసు వ్యవస్థ మధ్య శిక్షణ పొందిన వాలంటీర్లు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారని, సమస్య తీవ్రతను బట్టి బాధితులను షీ టీమ్స్, భరోసా కేంద్రాలు లేదా న్యాయ నిపుణుల వద్దకు చేరవేస్తారని పేర్కొన్నారు. మార్గదర్శకులు కేవలం సలహాదారులుగా మాత్రమే వ్యవహరించాలని, బాధితులు భయాందోళనలకు గురికాకుండా వారికి అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను వివరించి వ్యవస్థాగత సహాయం అందేలా చూడాలని సూచించారు.

ఇది కేవలం పోలీసుల కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రజలు, సంస్థల భాగస్వామ్యంతో నడిచే ప్రజా ఉద్యమంగా మారాలని సజ్జనార్ ఆకాంక్షించారు. మహిళా భద్రతలో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో, మహిళా భద్రతా విభాగం డీసీపీ డాక్టర్ లావణ్య ఎన్.జె.పి. నేతృత్వంలో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందన్నారు. జాయింట్ కమిషనర్ ఎన్ శ్వేతా, హెచ్‌‌సీఎస్‌‌సీ సెక్రటరీ జనరల్ శేఖర్ రెడ్డి, ఉమెన్స్ ఫోరం జాయింట్ సెక్రటరీ ఖ్యాతి నారాయణ తదితరులు పాల్గొన్నారు.