- అర్ధరాత్రి నిలోఫర్ కేఫ్ వద్ద వీరంగం.. ఒకరు అరెస్ట్, ముగ్గురు పరార్
గచ్చిబౌలి, వెలుగు: వీకెండ్‌లో రోడ్లు ఖాళీగా ఉండడంతో ఐటీ కారిడార్‌లో పోకిరీలు మితిమీరిన వేగంతో రేసింగ్‌లు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. తాజాగా రేసర్లు రెచ్చిపోయి, తనిఖీ చేయబోయిన పోలీసులపైకే కారును పోనిచ్చారు. మెహదీపట్నం అసిఫ్ నగర్‌కు చెందిన మహ్మద్ రెహ్వాన్ (18) పుల్లారెడ్డి కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. శనివారం రాత్రి ఇతడు తన స్నేహితులు ఓవైసీస్, అయాన్, వసీంలతో కలిసి మోడిఫై చేసిన హోండా సిటీ కారులో ఐటీ కారిడార్ నాలెడ్జ్ సిటీకి వచ్చాడు.
మరికొందరితో కలిసి అర్ధరాత్రి సమయంలో భారీ శబ్దాలు చేస్తూ నడిరోడ్డుపై ప్రమాదకర విన్యాసాలు, రేసింగ్‌లతో హల్‌చల్ చేశారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నాలెడ్జ్ సిటీలోని నిలోఫర్ కేఫ్ వద్దకు చేరుకుని వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెహ్వాన్ నడుపుతున్న కారును కానిస్టేబుల్ ఎం. రమేశ్అడ్డుకోబోగా, నిందితుడు కారును ఆపకుండా నేరుగా అతడి మీదికే పోనిచ్చాడు.
ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రమేశ్ చేతికి గాయాలయ్యాయి. అయినా వెనక్కి తగ్గని పోలీసులు సినిమా ఫక్కీలో ఆ కారును కిలోమీటరు దూరం వెంటాడి అడ్డుకున్నారు. కారు ఆగిన వెంటనే అందులోని ఓవైసీస్, అయాన్, వసీంలు చీకట్లోకి పారిపోగా, డ్రైవింగ్ సీట్లో ఉన్న రెహ్వాన్ పోలీసులకు చిక్కాడు. రెహ్వన్‌ను అరెస్టు చేసిన పోలీసులు రేసింగ్‌కు వాడిన కారును స్వాధీనం చేసుకున్నారు. పరారైన మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు
